శ్రీరామనవమికి భద్రాద్రి ముస్తాబు..పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం

శ్రీరామనవమికి  భద్రాద్రి  ముస్తాబు..పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం

 

  • నేటి సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి
  •     పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్​రెడ్డి 
  •     14 మంది సభ్యులతో ఉత్సవ కమిటీని ప్రకటించిన ప్రభుత్వం 

భద్రాచలం, వెలుగు: శ్రీరామనవమి సీతారాముల కల్యాణానికి భద్రాచలం రెడీ అయింది. శుక్రవారం మిథిలా స్టేడియంలో సీతారాములకు కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్​రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. 

భక్తుల కోసం 234 ఆర్టీసీ బస్సులు

భక్తుల కోసం ఆర్టీసీ అన్ని రూట్లలో 234 బస్సులను నడుపుతున్నది. ఏపీ నుంచి మరో 172 బస్సులు రానున్నాయి. భద్రాచలం టు హైదరాబాద్​కు నేరుగా బస్సులను ఏర్పాటు చేశారు. భద్రాచలం నుంచి పర్ణశాలకు ఎక్కువగా సర్వీసులు నడపాలని నిర్ణయించారు. బయట ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలకు బ్రిడ్జి పాయింట్, మార్కెట్ కమిటీ ప్రాంగణం, జూనియర్  కాలేజీ క్రీడా మైదానాల్లో పార్కింగ్​ ఏర్పాటు చేశారు. అక్కడ మరుగుదొడ్లు, తాగునీటి వసతిని సిద్ధం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎస్పీ రోహిత్ రాజ్, ఏఎస్పీ విక్రాంత్​కుమార్​ సింగ్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో బందోబస్తును కట్టుదిట్టం చేశారు. 

భద్రాచలంలో 8, పర్ణశాలలో 2 చికిత్స కేంద్రాలు 

వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో భద్రాచలంలో 8, పర్ణశాలలో రెండు ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. 36 మంది డాక్టర్లు, 172 మంది సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. అత్యవసర మందులు, అంబులెన్సులు, ఓఆర్​ఎస్​ ప్యాకెట్లు, ఏరియా ఆస్పత్రిలో 30 పడకలను సిద్ధం చేశారు. ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం ఫైర్​ స్టేషన్లకు చెందిన 54 మంది ఉద్యోగులతో పాటు రెస్క్యూ టీమ్​లను రెడీగా ఉంచారు. సింగరేణి, బీటీపీఎస్​ నుంచి కూడా రెస్క్యూ టీంలు  వచ్చాయి. విద్యుత్​ అంతరాయం లేకుండా డీఈ జీవన్​కుమార్​ఆధ్వర్యంలో 33 కేవీ ఫీడర్​ను ఏర్పాటు చేయడంతో పాటు జనరేటర్లను అందుబాటులో ఉంచారు. మిథిలాస్టేడియంలో భక్తులను వేసవితాపం నుంచి ఉపశమనం కోసం 20 అడుగుల ఎత్తులో వాటర్​స్ర్పే వెదజల్లే విధంగా 800 పరికరాలను ఏర్పాటు చేశారు. లక్ష చదరపు అడుగుల్లో భక్తులు వేచిఉండేందుకు ఏర్పాట్లు చేయగా వారందరికీ ఈ పరికరాలు ఉపశమనం కలిగించనున్నాయి. స్టేడియంలో భక్తులు కూర్చునేందుకు కొబ్బరి పీచుతో మ్యాట్​లు పరిచారు. బస్సు దిగిన ప్రాంతం నుంచి ఆలయం వరకు భక్తులు వెళ్లే మార్గం పొడువునా షామియానాలు వేశారు. 

తలంబ్రాలు, ప్రసాదాలకు కౌంటర్లు

శ్రీరామనవమి వేడుకకు వచ్చే భక్తుల కోసం తలంబ్రాలు, ప్రసాదాలను అందించేందుకు 80 స్పెషల్​ కౌంటర్లను ఈవో దామోదర్​రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఐదు లక్షల తలంబ్రాల ప్యాకెట్లు, మూడు లక్షల లడ్డూలు తయారు చేశారు. భక్తులకు ఉచితంగా తలంబ్రాలను అందజేయనున్నారు. భక్తులు సేద తీరేందుకు గుడి చుట్టూ తాత్కాలిక వసతిని ఏర్పాటు చేశారు. భక్తులు బయట కూడా కల్యాణాన్ని వీక్షించేలా 12 సెంటర్లలో 46 ఎల్​ఈడీ స్క్రీన్లు పెట్టారు. పట్టణంలో రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఐజీ, డీఐజీ, పోలీస్​కమిషనర్​తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ, ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో స్పెషల్​టీమ్​లను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్​రెడ్డి, గవర్నర్​పర్యటనల నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా పెంచారు. భక్తులు ప్రశాంతంగా కల్యాణం వీక్షించి, తలంబ్రాలతో తిరిగి వెళ్లేలా  కలెక్టర్​అంకిత్​ కుమార్​ ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ఉత్సవాల కోసం ప్రత్యేకంగా కమిటీ 

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల కోసం రాష్ట్ర సర్కారు ప్రత్యేకంగా ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 14 మంది సభ్యులున్నారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, పోతురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, గంగారపు శ్రీనివాసరావు, చావా లక్ష్మీనారాయణ, నాగేంద్రకుమార్​ త్రివేది, మిట్టపల్లి నాగేశ్వరరావు, పూజారి సురేందర్, బండి శ్రీనివాసరెడ్డి, దోస్పేటి చంద్రశేఖర్, రంగా జనార్దనరావు, మారాసు రాము, దండా సత్యనారాయణ, బాణోత్​ బాలూ నాయక్, కన్నా మహేశ్​కుమార్​ తదితరులు ఈ కమిటీలో ఉన్నారు.

భద్రాచలం చేరుకున్న డీజీపీ శివధర్​రెడ్డి

డీజీపీ శివధర్​రెడ్డి గురువారం భద్రాచలం చేరుకున్నారు. ఐటీసీలో ఆర్మ్ డ్​ రిజర్వ్ పోలీసుల నుంచి ఆయన గౌరవవందనం స్వీకరించారు. ఎస్పీ రోహిత్​రాజ్ ను అడిగి ఆయన భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.  

నేత్రపర్వంగా రాములోరి ఎదుర్కోలు

రామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామికి గురువారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉత్సవమూర్తులను తొలుత వివిధ పుష్పాలతో శోభాయామానంగా అలంకరణ చేశారు. పల్లకీపై ఆలయం నుంచి మంగళవాయిద్యాల నడుమ మిథిలాస్టేడియం ముఖద్వారం వద్దకు తీసుకొచ్చారు. వైకుంఠద్వారం వద్ద రామచంద్రుడిని, మిథిలాద్వారం వైపు సీతమ్మ తల్లిని ఎదురెదురుగా ఆసీనులను చేశారు. అయోధ్య నుంచి రాముడు, మిథిలా నుంచి సీతమ్మతల్లి వచ్చినట్లుగావేదపండితులు తెలిపారు. సీతారాముల గుణగణాలను సౌందర్యాన్ని, వంశ గౌరవాన్ని ప్రతిభను ఒకరికి మరొకరు తీసిపోనట్లుగా వర్ణించి ఎంతో ఆసక్తిగా ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అర్చకులు నృత్యం చేస్తూ పూలమాలలను భక్తుల కరతాళ ధ్వనులు మధ్య మాలా పరివర్తన కార్యక్రమం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవిన్యూ, ఎండోమెంట్​ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, ఎండోమెంట్ కమిషనర్​ హన్మంతరావు, మాజీ టీటీడీ చైర్మన్​ కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఈవో దామోదర్​రావు తదితరులు పాల్గొన్నారు.