మాజీ డీఎస్పీ నళినిని ఆదుకుంటం.. ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది: సీఎం హామీ

మాజీ డీఎస్పీ నళినిని ఆదుకుంటం.. ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది: సీఎం హామీ
  • సర్వీస్​ ఇష్యూలను  పరిష్కరిస్తమని సీఎం హామీ
  • నళినిని కలిసి వివరించిన యాదాద్రి కలెక్టర్​ 
  • ‘నా మరణ వాంగ్మూలం’ పేరిట నళిని రాసిన లేఖపై స్పందన

యాదాద్రి వెలుగు: మాజీ డీఎస్పీ నళినిని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆమెకు సంబంధించిన సర్వీస్​ ఇష్యూలు ఏమున్నా.. రూల్స్​ ప్రకారం పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. ‘నా మరణ వాగ్మూలం’ పేరిట  నళిని  తన ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్​ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో పోస్ట్​ చేసిన కథనానికి స్పందించిన  సీఎం..  వెంటనే ఆమెను  కలిసి మాట్లాడాలని జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు.  సీఎం ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీ నళినిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ హనుమంతరావు కలిశారు. సోమవారం భువనగిరిలోని ఆమె నివాసానికి వెళ్లి మాట్లాడారు.

ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను రోజుల తరబడి రుమటాయిడ్  ఆర్థరైటిస్, చికెన్ గున్యా, టైఫాయిడ్ సమస్యలతో బాధపడుతున్నానని నళిని తెలిపారు. అల్లోపతి మెడిసన్​ వల్ల సైడ్​ ఎఫెక్ట్​ వస్తుండడంతో.. ఆయుర్వేద మందులను వాడుతున్నానని వివరించారు. కాగా, ఆమెకు సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్​ తెలిపారు. సర్వీస్‌‌‌‌‌‌‌‌ సమస్యల్ని త్వరలో పరిష్కరిస్తామన్న సీఎం సందేశాన్ని నళినికి వివరించారు. నళిని చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. 

బెనిఫిట్స్​ వెంటనే విడుదల చేయాలి: ఎన్.​ రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు
నళినికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ను వెంటనే విడుదల చేయాలని బీజేపీ స్టేట్​చీఫ్​ రాంచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు డిమాండ్​ చేశారు. ‘వెలుగు’ దినపత్రికలో ‘ఇది నా మరణ వాగ్మూలం’ పేరుతో మాజీ డీఎస్పీ నళిని ఇచ్చిన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై వచ్చిన కథనాన్ని చదివిన ఆయన.. భువనగిరిలోని నళిని ఇంటికి చేరుకొని  పరామర్శించారు. 

నళిని ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆమెకు మద్దతుగా నిలుస్తామని, ప్రధాని మోదీ అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్​ తీసుకొని కలిపిస్తామని చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బెనిఫిట్స్​ కోసం సీఎంను నళిని కలిసి రోజులు గడుస్తున్నా.. రిలీజ్​ చేయకపోవడం సరికాదన్నారు. బెనిఫిట్స్ రాకపోవడంతో  మానసికంగా కృంగిపోవడం వల్ల ఆమె ఆరోగ్య క్షీణించిందన్నారు.  

నళినికి అండగా ఉంటా: బండారు దత్తాత్రేయ
అనారోగ్యంతో బాధపడుతున్న నళినికి అండగా ఉంటానని మాజీ గవర్నర్​ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ మేరకు నళినికి ఫోన్​ చేసి ఆమె ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయుర్వేదంపై నళినికి ఉన్న నమ్మకాన్ని  తెలుసుకొని.. రాందేవ్​ బాబాతో మాట్లాడారు. నళినికి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్​ అందించడానికి రాందేవ్​ బాబా అంగీకరించారని దత్తాత్రేయ తెలిపారు. ప్రధాని మోదీ, కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్లి.. ఆమెకు సహాయం అందేలా చూస్తానన్నారు.