పాలమూరు మున్సిపాలిటీలకు రూ.370 కోట్లు.. కొత్త, పాత పురపాలికలకు రూ.15 కోట్ల చొప్పున కేటాయింపు

పాలమూరు మున్సిపాలిటీలకు రూ.370 కోట్లు.. కొత్త, పాత పురపాలికలకు రూ.15 కోట్ల చొప్పున కేటాయింపు
  •  సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాలతో ఫండ్స్​ రిలీజ్​ చేసిన మున్సిపల్​ శాఖ
  • ప్రాధాన్యతాక్రమంలో అభివృద్ధి పనులకు వాడుకోవాలని సూచన

మహబూబ్​నగర్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మున్సిపల్​ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.370 కోట్ల  నిధులు విడుదల చేసింది. మున్సిపల్​ పాలకవర్గాల గడువు ముగిసి తొమ్మిది నెలలు పూర్తి కాగా, ఇన్​చార్జీల పాలన కొనసాగుతోంది. అయితే నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో గతంలో 19 మున్సిపాలిటీలు ఉండగా.. కొద్ది రోజుల కిందట మేజర్​ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా, గ్రేడ్–1 మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా రాష్ట్ర ప్రభుత్వం అప్​గ్రేడ్​ చేసింది. 

దీంతో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్​నగర్​ మున్సిపాలిటీ కార్పొరేషన్​గా అప్​గ్రేడ్​ కాగా.. మహబూబ్​నగర్​ జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట జిల్లాలోని మద్దూరు మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో  మున్సిపాలిటీల సంఖ్య 20కి చేరగా.. ఒక కార్పొరేషన్​ ఏర్పాటైంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై ఫోకస్​ పెట్టింది. 

నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు..

పట్టణాలు, నగరాల్లో డెవలప్​మెంట్​ వర్క్స్​ చేపట్టేందుకు నిధులు విడుదల చేయాలని మున్సిపల్​ శాఖకు తాజాగా సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ శాఖ కొత్త, పాత మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఆయా మున్సిపాలిటీలకు చేరాయి. అయితే ఇటీవల మున్సిపాలిటీల్లోకి విలీనం అయిన గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు చేయడానికి అదనంగా నిధులు కేటాయించింది. 

మహబూబ్​నగర్  జిల్లాలో 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్​ ఉండగా, నాగర్​కర్నూల్​లో 4, వనపర్తిలో 5, గద్వాలలో 4, నారాయణపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలకు రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు కేటాయించింది. కార్పొరేషన్​కు రూ.30 కోట్లు రిలీజ్​ చేయగా, నగరాభివృద్ధి, అర్బన్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్​ ఫండ్(యూఐడీఎఫ్) నుంచి ఈ నిధులను మంజూరు చేసింది. ఈ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని 20 మున్సిపాలిటీలతో పాటు పాలమూరు కార్పొరేషన్​కు రూ.370 కోట్లు 
విడుదలయ్యాయి.

ప్రయారిటీ పనులకే నిధులు..

మున్సిపాలిటీలకు భారీగా నిధులు విడుదల చేసిన సర్కారు, ఈ ఫండ్స్​ను ప్రయారిటీ పనులకు మాత్రమే వినియోగించాలని సంబంధిత శాఖ నుంచి మున్సిపాలిటీలకు ఆదేశాలు వచ్చాయి. నగరాలు, పట్టణాల్లో ప్రధాన సమస్యలైన రోడ్లు, డ్రైనేజీలు, అండర్​ డ్రైనేజీలు, సైడ్​ డ్రైన్​లు, ఓపెన్​ జిమ్​లు, మినీ జిమ్​లు, ప్లే గ్రౌండ్స్, చిన్న పిల్లల పార్కులు, ఆక్సిజన్​ పార్కుల ఏర్పాటు కోసం ఎస్టిమేషన్లు తయారు చేసి నిధులు కేటాయించాలని సూచించారు. 

అలాగే ఈ పనులకు తర్వరలో టెండర్లు ఆహ్వానించి, వచ్చే మార్చి లోపు పనులు పూర్తి చేసేలా డెడ్​లైన్​ విధించినట్లు తెలిసింది. ఈక్రమంలో సంబంధిత ఆఫసీర్లు ఎక్కడెక్కడ ఏ పనులు చేపట్టాలనే వివరాలు సేకరిస్తున్నారు. కొత్తగా చేపట్టబోయే పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పేపర్​ వర్క్​ పూర్తి చేసి వచ్చే వారం టెండర్లు పిలిచే అవకాశం ఉంది. కాగా, గతంలో ప్రారంభించి నిధులు లేక మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి ​పనులను కూడా టేకప్​ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.