కిషన్ రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ : సీఎం రేవంత్ రెడ్డి

కిషన్ రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ : సీఎం రేవంత్ రెడ్డి
  • హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నది వాళ్లే: సీఎం రేవంత్​రెడ్డి
  • నగరంలో ఒక్క ప్రాజెక్టునూ ముందుకు సాగనిస్తలేరు
  • ఐటీఐఆర్​ను రద్దు చేయడం తప్ప వీళ్లు చేసిందేమీలేదు
  • మెట్రో రైలును ఒక్క కిలోమీటరు కూడా పొడిగించనివ్వలే
  • కమీషన్ల కోసం కాళేశ్వరం, కొత్త సెక్రటేరియెట్​.. ప్రతిపక్షాలపై 
  • నిఘా కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్​ను కేసీఆర్​ కట్టిండు
  • ప్రాణభయంతో ప్రగతిభవన్​లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్​లు నిర్మించుకున్నడు
  • 16 వేల కోట్ల మిగులు బడ్జెట్​తో రాష్ట్రాన్ని ఇస్తే 8 లక్షల కోట్ల అప్పు చేసిండు
  • ఆ అప్పుల మిత్తీలకే నెలకు రూ.6,500 కోట్లు పోతున్నయ్​
  • రాష్ట్రంలోకి డ్రగ్స్ సంస్కృతి తెచ్చిన విషపురుగు కేటీఆర్ 
  • బీఆర్​ఎస్​ నుంచి ఒక్కొక్కరినీ హరీశ్​రావే బయటకు పంపిండు
  • బండి సంజయ్​ లెటర్​ రాస్తే గోపీనాథ్​ మరణంపై ఎంక్వైరీ
  • పిల్లల జీవితాలతో ప్రైవేట్ ​కాలేజీలు చెలగాటం ఆడితే ఊరుకోం
  • మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు

హైదరాబాద్​, వెలుగు: కిషన్​రెడ్డి, కేటీఆర్​ ఏకమై మెట్రో, గోదావరి జలాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీకి అడ్డుపుల్లలు వేస్తున్నారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘నగర ప్రజల కోసం పరితపించిన పీజేఆర్, శశిధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేవారు. నగరాభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్​ రెడ్డి, కేటీఆర్​ను ఇప్పుడు జనం బ్యాడ్​ బ్రదర్స్​ అంటున్నరు” అని తెలిపారు. డ్రగ్స్​ సంస్కృతిని తెచ్చిన విష పురుగు కేటీఆర్​ అని.. కేసీఆర్​కు అండగా నిలబడ్డోళ్లను బీఆర్​ఎస్​ పార్టీ నుంచి హరీశ్​రావు బయటికి పంపేశారని ఆయన అన్నారు.

అన్నాచెల్లెళ్లు కలిసి ఉంటే సమస్య వస్తదని కవితను కూడా బీఆర్​ఎస్​ నుంచి హరీశ్​ బయటికి నెట్టేసిండు’’ అని వ్యాఖ్యానించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్​, కొత్త సెక్రటేరియెట్​ను కేసీఆర్​ కట్టారని.. ప్రతిపక్ష నాయకులను సీసీ కెమెరాల్లో చూసేందుకు, ఫోన్​ ట్యాపింగ్​ చేసేందుకే  కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ను నిర్మించారని ఆయన మండిపడ్డారు. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్​తో రాష్ట్రాన్ని కేసీఆర్​కు​ అప్పగిస్తే రూ. 8 లక్షల 11 వేల కోట్లు అప్పుచేసి ఇచ్చారని ఫైర్​ అయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్​లో నిర్వహించిన ప్రెస్​మీట్​లో సీఎం రేవంత్​రెడ్డి వివిధ అంశాలపై మాట్లాడారు. 

ఐటీఐఆర్​ను రద్దు చేశారు.. మెట్రోను ఆపారు 

హైదరాబాద్ లో ఇంటర్నేషనల్​ ఎయిర్ పోర్ట్, మెట్రో, నాలెడ్జ్ సెంటర్స్, ఐటీ, ఫార్మా ఇలా అన్ని రంగాల అభివృద్ధికి 2014 కంటే ముందే కాంగ్రెస్ పార్టీ బీజం వేసిందని సీఎం రేవంత్​ తెలిపారు. ఐటీఐఆర్​ను     హైదరాబాద్​కు రాకుండా అడ్డుకున్నది బీఆర్​ఎస్, బీజేపీనేనని మండిపడ్డారు. కాంగ్రెస్ తీసుకున్న భవిష్యత్​ ప్రణాళికలతోనే హైదరాబాద్ ఆదాయం పెరిగిందని చెప్పారు. వరదల్లో హైదరాబాద్ మునిగిపోతే కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకురాలేదన్నారు.

 ఆనాడు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విద్యా సంస్థలే మనకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చాయని తెలిపారు.   ‘‘కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్​ను రద్దు చేయడం తప్ప వీళ్లు ఒక్క అదనపు ఎయిర్ పోర్టునైనా తెచ్చారా? పదేండ్లలో మెట్రోను ఒక కిలోమీటరైనా విస్తరించారా? నగర విస్తరణతోపాటు మెట్రో విస్తరణ ఎందుకు చేయలేదు?  కాంగ్రెస్ మొదలు పెట్టిన సాగునీటి ప్రాజెక్టులను పదేండ్లలో ఎందుకు పూర్తి చేయలేదు? కేసీఆర్​కు 16 వేల కోట్ల మిగులు బడ్జెట్​తో రాష్ట్రాన్ని అప్పగిస్తే రూ.8.11 లక్షల కోట్ల అప్పుతో అప్పగించిండు. 

పదేండ్లలో 20 లక్షల కోట్ల బడ్జెట్ ను ఏం చేశారో సమాధానం చెప్పాలి’’ అని రేవంత్​ నిలదీశారు. తాను సెక్రటేరియెట్​కు రావట్లేదన్నట్లుగా హరీశ్​రావు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సెక్రటేరియెట్​లో చేయాల్సిన పనులు సెక్రటేరియెట్​లో చేస్తున్నాను. కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ మా తాత కట్టించిండా.. ఇది కూడా ప్రభుత్వానిదే కదా..! దీనిని క్యాంప్​ ఆఫీస్​లా ఉపయోగిస్తూ పనిచేయడం కూడా తప్పేనా..? మేం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నం” అని పేర్కొన్నారు.  

బుల్లెట్​ ప్రూఫ్​ బాత్రూమ్​లు కట్టుకున్నడు

‘‘కేసీఆర్​ తన కొడుకు కోసం పాత సెక్రటేరియెట్​ను కూల్చి కొత్తది కట్టిండు. దీని వల్ల  ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? పేద ప్రజలకు ఎవరికైనా అక్కరకొచ్చిందా? ఏమైనా ప్రయోజనం ఒనగూరిందా? నాడు సెక్రటేరియెట్​లో ఆలయం కూల్చేస్తే కిషన్ రెడ్డి స్పందించారా?” అని సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్నించారు.‘‘కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్​  లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్​,  
సొంత అవసరాల కోసం రూ.2 వేల కోట్ల ప్రభుత్వ నిధులతో కొత్త సెక్రటేరియెట్​ కట్టిండు. 

ప్రతిపక్ష నాయకులపై నిఘా కోసం, ఫోన్ ట్యాపింగ్ కోసం   కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకున్నడు. సద్దాం హుస్సేన్ లా ప్రాణభయంతో తనను తాను కాపాడుకునేందుకు ప్రగతి భవన్ లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ లు కట్టుకుండు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేని ప్రగతి భవన్, కాళేశ్వరం, కమాండ్ కంట్రోల్ సెంటర్​, కొత్త సెక్రటేరియెట్​ను  చూపించి ఇంకా ఎన్నాళ్లు కాలం గడుపుతారు? కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు దండుకుని దోచుకున్నరు తప్ప ప్రజలకు ఉపయోగపడే పని చేసిన్రా?” అని నిలదీశారు. కాళేశ్వరం కట్టి లక్ష కోట్ల రూపాయలు గోదావరిపాలు చేశారని మండిపడ్డారు. 

డ్రగ్స్ సంస్కృతిని తెచ్చిన విషపురుగు కేటీఆర్ 

రాష్ట్రంలో డ్రగ్స్​ సంస్కృతిని తెచ్చిన విషపురుగు కేటీఆర్​ అని సీఎం రేవంత్​ మండిపడ్డారు. ‘‘వాళ్ల(కేటీఆర్​) బామ్మర్ది డ్రగ్స్ తీసుకుని దొరికింది నిజం కాదా?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ కనిపిస్తే తొక్కి నార తీస్తామని హెచ్చరించారు. ‘‘రాష్ట్రంలో కేటీఆర్​ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కేవలం గంజాయి, డ్రగ్స్ కల్చర్​ని తీసుకొచ్చిండు. మా పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను రౌడీ అని కేటీఆర్​ మాట్లాడుతున్నడు. 

ఎవరు రౌడీ..? దీపావళి పండుగ రోజున గంజాయి కొట్టేవాడు రౌడీ అవుతడా..? లేదంటే పేదోళ్లకు అండగా నిలబడేవాడు రౌడీ అవుతడా?’’  అని నిలదీశారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే బీఆర్​ఎస్​, బీజేపీ వాళ్లకు ఏడుపు ఎందుకన్నారు. ‘‘కేటీఆర్​, కిషన్​ రెడ్డి మధ్య బ్యాడ్​ బ్రదర్స్​ బంధం పెరిగింది. కిషన్​ రెడ్డీ.. ఎందుకు మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్నవ్? ఎందుకు కేటీఆర్ కు లొంగిపోయినవ్​? ప్రజలకు సమాధానం చెప్పు” అని సీఎం నిలదీశారు. 

నగరంలోని 695 చెరువుల్లో 44 చెరువులను బీఆర్​ఎస్ కబ్జా చేసిందన్నారు. ‘‘మీరు ఆక్రమించుకున్న చెరువులను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నందుకు హైడ్రాపై విషం చిమ్ముతున్నరా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న ఎడ్ల సుధాకర్ రెడ్డి ఎవరు.. బీఆర్​ఎస్ నేత కాదా? సున్నం చెరువు, నల్ల చెరువును ఆక్రమించుకుంది నిజం కాదా’’ అని ప్రశ్నించారు. వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించి నగరంలో రోడ్లపై నీళ్లు నిలవకుండా హైడ్రా చూస్తున్నదని తెలిపారు. ఈగల్ ఫోర్స్, హైడ్రాపై కేటీఆర్ కక్ష పెట్టుకుంచుకున్నారని.. హైడ్రా ఎక్కడ తప్పు చేసిందో చెప్తే నిజ నిర్ధారణ కమిటీ వేద్దామన్నారు. 

సంజయ్​ లెటర్​ రాస్తే గోపీనాథ్​ మరణంపై ఎంక్వైరీ

మాగంటి గోపీనాథ్​ మరణం వెనుక కేటీఆర్ హస్తం ఉన్నదని ఆరోపిస్తున్న బండి సంజయ్​ కేంద్రమంత్రి హోదాలో లెటర్​ రాస్తే ఎంక్వైరీ చేయించేందుకు తాను సిద్ధమని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. ‘‘ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని నేను అనుకోవడం లేదు. కానీ, మాగంటి గోపీనాథ్​ తల్లి తన కుమారుడి మరణానికి కేటీఆర్​ కారణం అని అన్నట్లు నేను మీడియాలో చూశాను. ఇప్పుడు బండి సంజయ్​ కూడా అదే ఆరోపణ చేస్తున్నారు’’ అని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో బీఆర్ఎస్​ ఓడిపోతుందని, బీజేపీకి డిపాజిట్ కూడా రాదన్నారు.

 బండి సంజయ్​, అర్వింద్, ఈటల​ రాజేందర్​ లాంటి వాళ్లకు బీజేపీ గెలవాలనే తాపత్రం ఉన్నా కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి జూబ్లీహిల్స్​లో గెలవడం ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు.  హిందువులంతా కాంగ్రెస్​కు వ్యతిరేకంగా ఏకం కావాలన్న బండి సంజయ్ ​వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘ఒకవేళ జూబ్లీహిల్స్​లో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్​ రాకపోతే హిందువులంతా బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్లు రెఫరెండంగా బండి సంజయ్​భావిస్తరా?’’ అని ప్రశ్నించారు. 

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్​ దక్కదన్నారు. ఏ ఎన్నికలైనా తన ఎన్నిక అనుకునే పనిచేస్తానని,  సర్వేలపై చర్చ అనవసరమని పేర్కొన్నారు. కొన్ని పొలిటికల్ పార్టీలు వారికి అనుకూలంగా సర్వే ఫలితాలు ప్రకటించుకుంటున్నాయని.. నవంబర్ 14న నిజం అందరికీ తెలుస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్​ఎస్ అభ్యర్థి ఓటమి, బీజేపీ డిపాజిట్ పోవడం ఖాయమైందని ఆయన పేర్కొన్నారు. 

పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే ఊరుకోం

ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు ఇవ్వడం లేదనే సాకుతో కాలేజీలను బంద్​పెట్టి, పిల్లల జీవితాలతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోబోమని ప్రైవేట్​ కాలేజీల యాజమాన్యాలకు సీఎం రేవంత్​రెడ్డి తేల్చిచెప్పారు. ‘‘విద్య వ్యాపారం కాదు. మీ వ్యాపార తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించొద్దు. మీ స్వార్థం కోసం పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా, రాజకీయపార్టీలైనా కఠినంగా వ్యవహరిస్తం” అని హెచ్చరించారు. 

ప్రైవేటు కాలేజీలకు విడతలవారీగా ఫీజు రీయింబర్స్​మెంట్​ చెల్లించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ‘‘మూడు నెలలకో, ఆరు నెలలకో బకాయిలు చెల్లిస్తం. నిబంధనల ప్రకారం ఫీజు రీయింబర్స్​ మెంట్​ అడుగుతున్న మీరు.. మరి ఆ నిబంధనల ప్రకారం కాలేజీలు నడుస్తున్నయా? లేదా? అని అధికారులను తనిఖీలకు పంపితే కాలేజీలకు తాళాలేసుకొని ఎందుకు పోతున్నరు? మీ తీరు వల్ల పోయిన అకడమిక్​ ఇయర్​ వెనక్కి వస్తదా? ” అని ప్రశ్నించారు. ‘‘2014–15లో ప్రైవేట్​విద్యా సంస్థల వ్యవహారంపై విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ నివేదిక ఇచ్చినా కేసీఆర్​ చర్యలు తీసుకోలే. పైగా ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు పెట్టి పోయిండు. కేసీఆర్​ పెట్టిపోయిన బకాయిల గురించి ఆయన్నే అడుగున్రి. ఉన్నవే 3,600 కోట్ల బకాయిలైతే రూ. 6 వేల కోట్ల బకాయిలు అని మాట్లాడుతున్నరు. ఒకాయన12 కాలేజీలకు పర్మిషన్లు ఇవ్వాలని పైరవీకి వచ్చిండు. ఇయ్యలే. ఇంకొకాయన క్యాంపస్​ పర్మిషన్​ కోసం వచ్చిండు. అవి రూల్స్​కు వ్యతిరేకమని పర్మిషన్​ ఇయ్యకపోయేసరికి మిగిలిన కాలేజీలను, విద్యార్థులను రెచ్చగొట్టి.. ఏది పడితే అది మాట్లాడుతున్నరు. రాజకీయ ప్రేరేపిత స్టేట్​మెంట్లు ఇస్తూ, అధికారులను తిట్టినంత మాత్రాన మీకు ఫీజు రీయింబర్స్​మెంట్​ రాదు’’ అని సీఎం స్పష్టంచేశారు. 

కాలేజీల్లో ఫీజులు పెంచాలంటూ ఒక్కొక్కరు అడ్డగోలు ఫీజులు వేసుకొని వచ్చారని, తాను ఒప్పుకోకపోయేసరికి ఈ వేషాలు వేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రైవేట్​కాలేజీల యాజమాన్యాలు స్టూడెంట్ల దగ్గర నుంచి ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నయో కూడా లెక్కతీస్తామని, వచ్చే సంవత్సరం నుంచి ఎలా వసూలు చేస్తయో చూస్తామని తెలిపారు. ‘‘2014 నుంచి ఇప్పటివరకు చదువుకున్న విద్యార్థులెవరు? ఫీజు రీయింబర్స్​మెంట్​ పొందిన సంస్థలెవ్వి? ఈ రోజు ఎవరెవరికి బకాయిలున్నయ్​? అనే విషయంపై సిట్​ ఏర్పాటుచేసి విచారణ చేయిస్తం” అని ఆయన తేల్చిచెప్పారు.  

ఒక్కొక్కరినీ హరీశ్  బయటికి పంపిండు

బీఆర్​ఎస్​ పార్టీలో కేసీఆర్​కు అండగా నిలుచునెటోళ్లను ఒక్కొక్కరిని హరీశ్​రావు బయటికి పంపారని సీఎం రేవంత్​ అన్నారు. ‘‘కేటీఆర్, కవిత కలిసి ఉంటే సమస్య వస్తదని హరీశ్​ అనుకున్నడు.. అందుకే కవితను కూడా బయటికి నెట్టేసిండు. కుటుంబంలోనే సఖ్యతగా లేని ఇలాంటి వాళ్లా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది? ప్రజలు ఒకసారి ఆలోచించాలి” అని తెలిపారు. ‘‘జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఒకటే సూచన చేయదలచుకున్నా.. కాంగ్రెస్, బీఆర్​ఎస్​ చేసిన అభివృద్ధిని పోల్చి చూసి ఆలోచనతో ఓటు వేయాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తం” అని ఆయన హామీ ఇచ్చారు.  

రాష్ట్రంలో కేటీఆర్​ చేసిన అభివృద్ధి ఏంది? గంజాయి, డ్రగ్స్ కల్చర్​ని తీసుకొచ్చిండు. మా పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్​ను రౌడీ అని అంటున్నడు. ఎవరు రౌడీ..? దీపావళి పండుగ రోజున గంజాయి కొట్టేవాడు రౌడీ అవుతడా..? లేదంటే పేదోళ్లకు అండగా నిలబడేవాడు రౌడీ అవుతడా?  కేటీఆర్​, కిషన్​ రెడ్డి బ్యాడ్​ బ్రదర్స్​ మధ్య బంధం పెరిగింది. కిషన్​ రెడ్డీ.. ఎందుకు మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్నవ్? ఎందుకు కేటీఆర్​​కు లొంగిపోయినవ్​? ప్రజలకు సమాధానం చెప్పు. 

బీఆర్​ఎస్​ నేతలు ఆక్రమించుకున్న చెరువులను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నందుకు హైడ్రాపై విషం చిమ్ముతున్నరా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న ఎడ్ల సుధాకర్ రెడ్డి ఎవరు.. బీఆర్​ఎస్ నేత కాదా? సున్నం చెరువు, నల్ల చెరువును ఆక్రమించుకున్నది నిజం కాదా?- సీఎం రేవంత్

ఫీజు రీయింబర్స్​మెంట్​ లెక్కలపై సిట్​ వేస్తం

2014 నుంచి ఇప్పటివరకు చదువుకున్న విద్యార్థులెవరు? ఫీజు రీయింబర్స్​మెంట్​ పొందిన సంస్థలెవ్వి? ఇప్పుడు ఎవరెవరికి బకాయిలున్నయ్​? అనే విషయంపై సిట్​ ఏర్పాటుచేసి విచారణ చేయిస్తం.విద్య.. వ్యాపారం కాదు. మీ వ్యాపార తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించొద్దు. మీ స్వార్థం కోసం పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా, రాజకీయపార్టీలైనా కఠినంగా వ్యవహరిస్తం. ప్రైవేటు కాలేజీలకు విడతల వారీగా ఫీజు​ రీయింబర్స్​మెంట్ చెల్లించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 

మూడు నెలలకో, ఆరు నెలలకో బకాయిలు చెల్లిస్తది. కానీ, నిబంధనల ప్రకారం ఫీజు రీయింబర్స్​ మెంట్​ అడుగుతున్న మీరు (కాలేజీ యాజమాన్యాలు).. మరి ఆ నిబంధనల ప్రకారం కాలేజీలు నడుస్తున్నయా? లేదా? అని అధికారులను తనిఖీలకు పంపితే కాలేజీలకు తాళాలేసుకొని ఎందుకు పోతున్నరు? మీ తీరు వల్ల పోయిన అకడమిక్​ ఇయర్​ వెనక్కి వస్తదా? - సీఎం రేవంత్​

కేసీఆర్​ చేసిన అప్పుల మిత్తీలకే నెలకు రూ. 6,500 కోట్లు 

కొత్తగా రేవంత్​తోనే సమస్యలు పుట్టుకొచ్చినట్లు, ఈ సమస్యలకు రేవంత్​రెడ్డే కారణమన్నట్లు మాట్లాడుతున్నారని, ప్రభుత్వాన్ని బ్లాక్​ మెయిల్​ చేస్తున్నారని సీఎం ఫైర్​అయ్యారు. ప్రభుత్వం దగ్గర నిధులు ఉండి కూడా ఇవ్వడం లేదన్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. ‘‘రాష్ట్రానికి ప్రతి నెలా 18 వేల కోట్ల నుంచి 18,500 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో 6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలకు పోతున్నయ్​. కేసీఆర్​ చేసిపోయిన అప్పుల మిత్తీలకు 6,500 కోట్లు అట్నుంచి అటే పోతున్నయ్​. రూ. 13 వేల కోట్లకు ఇది పక్కా ఖర్చు. ఇక మిగిలిన రూ. 5 వేల కోట్ల నుంచి 5,500 కోట్లలోంచే అన్ని వెల్ఫేర్​ స్కీములు, అభివృద్ధి పనులు జరగాల్సిన పరిస్థితి. 

సర్కారు ఖజానాలో డబ్బులున్నాక బకాయిలు ఎందుకు పెడ్తం?” అని తెలిపారు. ఆర్.కృష్ణయ్య, మందకృష్ణ లాంటివాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, వాళ్లిద్దరూ ముందుకు వస్తే నాలుగు నెలలపాటు సర్కారుకు వచ్చే ఆదాయాన్ని వాళ్ల చేతికే ఇస్తామని.. ఉద్యోగుల జీతాలు ఆపుతరో, కిస్తీలు ఆపుతరో, రైతు భరోసా ఆపుతరో ఆపి, కాలేజీలకు ఫీజు రీయింబర్స్​మెంట్​ ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు.  

రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినం

రాష్ట్ర అభివృద్ధి కోసం కేవలం ఒక్క ఏడాదిలోనే రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. తాము  అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో ఒక ఏడాది ఎన్నిక కోడ్ తో ఇబ్బందులు వచ్చాయన్నారు. తమ ప్రభుత్వ పనితీరుపై నమ్మకంతో ఎలీ లిల్లీ లాంటి కంపెనీ ఫార్మారంగంలో వన్​ బిలియన్ డాలర్స్  పెట్టుబ డులు పెడుతున్నదని, ఇది రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణమని చెప్పారు. కాంగ్రెస్ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును కూడా కమీషన్లకు కక్కుర్తి తో అమ్ముకున్నారని బీఆర్​ఎస్​ లీడర్లపై మండిప డ్డారు. రాబోయే పదేండ్ల కోసం కొత్త ప్రణాళిక లు రచిస్తున్నామని, తెలంగాణ రైజింగ్-2047 పేరిట విజన్ డాక్యుమెంట్ తయారు చేసు కుంటున్నామని తెలిపారు. 

తమ ప్రభుత్వం వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులకు అను మతులు తీసుకొచ్చిందన్నారు. మరిన్ని ఎయిర్ పోర్టులకు అనుమతులు తెచ్చే ప్రయత్నం చేస్తు న్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రై పోర్టు ఏర్పా టు కోసం, గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించేందుకు అనుమతులు తెచ్చుకున్నామని.. వేలాది కోట్లు తెచ్చి నగర విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తు న్నామని సీఎం రేవంత్​ వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వేలాది ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.