
- సమ్మక్క, సారలమ్మ పూజారుల సూచనల ప్రకారం ముందుకు
- సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం..ఈ నెల 23న మేడారానికి
హైదరాబాద్, వెలుగు: మేడారం అభివృద్ధి ప్రణాళికలపై క్షేత్రస్థాయిలో సమ్మక్క, సారలమ్మ పూజారులను సంప్రదించి వారి సూచనల మేరకు డిజైన్లను ఖరారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అలాగే మేడారం జాతర పనుల కోసం ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర అభివృద్ధి పనుల ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 23న ఆయన స్వయంగా మేడారానికి వెళ్లి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, పనులపై ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ పర్యటనలో సీఎంతోపాటు మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు కూడా పాల్గొంటారు. పూజారులు కోరిన విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కానీ.. గద్దెలను యథాతథంగా ఉంచి, సంప్రదాయాలను తూచ తప్పకుండా గౌరవించాలని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అలాగే, గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణాల డిజైన్లు ఉండాలని, ఆలయం పరిసరాల్లో ఆ ప్రాంతానికి చెందిన సంప్రదాయ వృక్షాలను పెంచాలని ఆయన సూచించారు.