
తెలంగాణ వనమహోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ప్రారంభించారు. రుద్రాక్ష మొక్కను నాటిన ఆయన ప్రతిఒక్కరు రెండు మొక్కలను నాటాలన్నారు.. తెలంగాణలో 18 వేల మొక్కలను నాటాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అమ్మ పేరుతో పిల్లలు మొక్కలు నాటాలని.. మొక్కలను మనం రక్షిస్తే అవి మనల్ని కాపాడుతాయన్నారు. మనం ప్రకృతిని కాపాడుకుంటేనే అభివృద్ది చెందుతామన్నారు,
బొటానికల్ గార్డెన్స్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి ... ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తుచేశారు. వనమహోత్సవంలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావించింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీల విద్యార్థులను వనమహోత్సవంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘ఒక విద్యార్థి.. ఒక మొక్క’ నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు.
పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులకు వన మహోత్సవంపై వ్యాసరచన, డ్రాయింగ్, క్విజ్ వంటి పోటీలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విద్యార్థులను ‘గ్రీన్ అంబాసిడర్లు’గా ప్రోత్సహించనున్నారు. తెలంగాణకు పచ్చని చీరను కప్పేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.