రూ.2 వేల 520 కోట్లు దాటిన ఆస్తి పన్ను.. వసూళ్లలో సీఎంసీ టాప్

రూ.2 వేల 520 కోట్లు దాటిన ఆస్తి పన్ను.. వసూళ్లలో సీఎంసీ టాప్
  • వసూళ్లలో సీఎంసీ టాప్ 
  • జీహెచ్ఎంసీకి రూ.965 కోట్లకు పైగా, సీఎంసీకి రూ.990 కోట్లకు పైగా, ఎంఎంసీకి రూ.555 కోట్లకు పైగా ఆదాయం

హైదరాబాద్ సిటీ, వెలుగు : 2025–26 ఆర్థిక సంవత్సరంలో మూడు కార్పొరేషన్లు కలిసి రూ.2520 కోట్లకు పైగా  ప్రాపర్టీ టాక్స్ కలెక్ట్ ​చేశాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2వేల కోట్ల టార్గెట్ పెట్టుకోగా, రూ.2038 కోట్లు వచ్చింది. ఈ సారి రూ. 2,500 కోట్లు పెట్టుకోగా, టార్గెట్ రీచ్ అయ్యిందని కమిషనర్లు తెలిపారు.

అప్పట్లో పాత జీహెచ్ఎంసీ పరిధి ఉండడంతో టార్గెట్ తక్కువగా ఉండేది. 2025–26 సంవత్సరానికి సంబంధించి 27 లోకల్ బాడీలు విలీనం కావడంతో వసూళ్ల లక్ష్యాన్ని రూ.2,500 కోట్లకు పెంచారు. మంగళవారం చివరి రోజు కావడంతో అర్ధరాత్రి వరకు కస్టమర్ సర్వీసు సెంటర్​(సీఎస్ సీ) లను ఓపెన్ చేసి ఉంచారు. సర్కిల్, జోనల్, హెడ్ ఆఫీసుల్లో అధికారులు ట్యాక్స్ కలెక్షన్ పై మానిటరింగ్ చేశారు. మొత్తానికి అనుకున్న ఆదాయం రావడంతో హర్షం వ్యక్తం చేశారు. మూడు నెలలుగా కొనసాగుతున్న ఓటీఎస్​ స్కీం మంగళవారంతో ముగిసింది. దీని ద్వారా రూ.560 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.

నేటి నుంచి సెపరేట్ పాలన..

నేటి నుంచి 3 కార్పొరేషన్ల పరిధిలో సెపరేట్ పాలన షురూ కానున్నది. ఇక ఎవరి నిధులు వారి ఖాతాల్లోనే జమ కానున్నాయి. ఆర్థికంగా కూడా కమిషనర్లు సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలతో పాటు కాంట్రాక్టర్ల బిల్లులు తదితర అన్ని ఆర్థిక లావాదేవీలు వేరుగా జరగనున్నాయి.  

ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి..  

2026–-2027 సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తి పన్ను చెల్లించి ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు ఆర్వీ కర్ణన్, సృజన, వినయ్​కృష్ణారెడ్డి  మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఏప్రిల్ నెలలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన  మొత్తం ప్రాపర్టీ టాక్స్‌‌ను ముందుగానే చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ వస్తుందన్నారు. గత ఏడాది బకాయిలపై ఈ రాయితీ వర్తించదన్నారు.