ఏపీలో ప్రభుత్వ పాఠశాలల సంరక్షణ కోసం సమిష్టి ఉద్యమం

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల సంరక్షణ కోసం సమిష్టి ఉద్యమం
  • ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి ఆందోళన
  • రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఉమ్మడిగా నిరసన ప్రదర్శనలు

అమరావతి: ఏపీలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం ఉపాధ్యాయ సంఘాలు సమిష్టి ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. ఉమ్మడి నిర్ణయం అమలులో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల కలెక్టరేట్ ల ఎదుట  ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడిగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ప్రభుత్వ పాఠశాలల విభజన, తరలింపులను అడ్డుకోకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఈ సందర్బంగా ఉపాద్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ విద్యావిధానం అమలు పేరుతో ఏపీ ప్రభుత్వం విద్యలో సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు నిర్ణయిస్తే స్వాగతించామని ఈ సందర్బంగా వారు గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం ఏకపక్షంగా 172 జీవో ద్వారా పాఠశాలల విభజనకు పూనుకుందని.. ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం కొనసాగుతున్న రెండు మాధ్యమాల స్థానంలో ఏదో ఒక మాధ్యమం మాత్రమే ఉంటుందని సర్క్యులర్ లో పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. 
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఉన్నత పాఠశాలల్లో రెండు మాద్యమాలు కొనసాగించాలని కోరుతూ ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక (ఫ్యాప్టో) ద్వారా వినతిపత్రాలు ఇచ్చామని వారు గుర్తు చేశారు. గత జూన్ 17న విద్యాశాఖ మంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వం మాట్లాడిన 40 సంఘాలలో 38 సంఘాలు వ్యతిరేకించినా ప్రభుత్వం ముందుకే వెళ్లాలని నిర్ణయించడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు వస్తాయనే ఆశ కల్పించి ఏదోవిధంగా ప్రభుత్వం తమ విధానాలు అమలు చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశం పోస్టులను తగ్గించడమేనని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మాధ్యమాలు ఎత్తేసి ఒకే మాధ్యమం ఏర్పాటు చేయడం వల్ల 18 వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగిలిపోతాయని, అలాగే 4 నుంచి 5 వేల మంది ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయులు కూడా సర్ ప్లస్ అవుతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ఖాళీలు భర్తీ చేయకుండా ఉన్న పోస్టులనే విలీనం పేరుతో పోస్టుల మిగులుబాటు చూపించే కుట్ర దాగి ఉందని, 2030 నికి పాఠశాల విద్యను పూర్తిగా ప్రైవేటీకరించే ప్రయత్నాలలో భాగంగానే ఈ సంస్కరణలు అమలు చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం ఉమ్మడిగా ఉద్యమాలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. 
ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రధాన డిమాండ్లు:
ప్రాథమిక పాఠశాలలను విభజించరాదు
ఉన్నత పాఠశాలలో రెండు మాధ్యమాలు కొనసాగించాలి
పూర్వ ప్రాధమిక పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేయాలి
ప్రాథమిక పాఠశాలలకు పి.ఎస్.హెచ్.ఎం పోస్టులను మంజూరు చేయాలి

ప్లస్ 2 తరగతులు బోధించేందుకు స్కూల్ అసిస్టెంట్ నుండి జూనియర్ లెక్చరర్/పీజీటీగా ప్రమోషన్ అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి.
విద్యాహక్కు చట్టం ప్రకారం మాతృభాషలో విద్యాబోధన జరగాలి.
9,10 తరగతుల నుంచి సీబీఎస్ఈ అనుసంధానం విరమించుకోవాలి.