
- కలెక్టర్ హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: రైతులు యూరియా వాడకాన్ని తగ్గించి, ఆర్గానిక్ సాగు పద్దతులను పాటించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం మండలంలోని తోర్నాల గ్రామంలోని వ్యవసాయ పరిశోధన స్థానం వద్ద నిర్వహించిన రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త వంగడాలను, పద్ధతులను పాటించి రసాయనాలు వాడకుండా పంటలు పండించాలని అగ్రికల్చర్విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో అధికారి సంతోష్ కుమార్, ఏడీఏ పద్మ, డీన్ సునీత దేవి, మాజీ సర్పంచ్ సదాశివ రెడ్డి, వ్యాపారవేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
కామన్ డైట్ పాటించకపోతే కఠిన చర్యలు..
పచ్చిపులుసు పెడుతూ పిల్లల ఆరోగ్యంతో ఆడుకుంటారా అని కలెక్టర్ హైమావతి తోర్నాల జడ్పీహెచ్ఎస్ స్కూల్ హెచ్ఎం, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని తోర్నాల జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ స్కూళ్లలో మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కామన్ మెనూ పాటించకుండా నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్, టీచర్ల పై చర్యలు తీసుకోవాలని డీఈఓను ఫోన్ ద్వారా ఆదేశించారు.
అనంతరం ప్రాంగణంలోని అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. కలెక్టరేట్ లో భూ భారతి పెండింగ్ అప్లికేషన్ డిస్పోజల్ ప్రక్రియ పై రెవెన్యూ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. పెండింగ్ అప్లికేషన్లు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా చూసుకోవాలని, భూభారతి చట్టంలోని మార్గదర్శకాల ప్రకారమే అప్లికేషన్ డిస్పోజల్ చేయాలన్నారు.