
జైపూర్(భీమారం), వెలుగు: కొనుగోలు సెంటర్ల నుంచి వరి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు పంపించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం ఆయన భీమారంతోపాటు మండలంలోని పోలంపల్లి, అర్కపల్లి, అంకుషాపూర్, జైపూర్ మండలం లోని ముదిగుంట, షెట్పల్లి, కిష్టాపూర్, కుందారం, వేలాల గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టార్పాలిన్లు సమకూర్చాలన్నారు.
భీమారం మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీసులో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియ, ఇందిరమ్మ ఇండ్లు అంశాలను పరిశీలించారు. నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం లోన్ సదుపాయం కల్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు మాత్రమే ఇవ్వాలని, అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్లు వనజారెడ్డి, సదానందం, ఎంపీడీవో మధుసూదన్ పాల్గొన్నారు.