ఇందిరమ్మ నిర్మాణాల్లో పురోగతి సాధించాలి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

ఇందిరమ్మ నిర్మాణాల్లో పురోగతి సాధించాలి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి 

ఆర్మూర్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని, ఆర్థిక స్థోమత లేనివారికి రుణాలు ఇప్పించాలని కలెక్టర్​ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆర్మూర్​లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడిన అనంతరం మున్సిపల్ లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, వనమహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

183 ఇండ్లు మాత్రమే గ్రౌండింగ్​..

ఆర్మూర్ లో 617 మందికి ఇండ్లు మంజూరు కాగా, కేవలం 183 గ్రౌండింగ్ జరిగాయని, మిగతావి ఎందుకు కాలేదని అధికారులపై కలెక్టర్​ ఆగ్రహించారు.  మెప్మా ఆధ్వర్యంలో రుణాలు ఇప్పించాలని, మహిళా సంఘాల్లో సభ్యులుగా లేనివారిని చేర్పించి రుణాలు ఇప్పించాలన్నారు.  వారంలో మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో స్పష్టమైన ప్రగతి కనిపించాలన్నారు. వనమహోత్సవం విజయవంతమయ్యేలా కృషి చేయాలన్నారు.  డబుల్​ బెడ్​ రూం ఇండ్లను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కేటాయించేలా అర్హుల జాబితాను రూపొందించాలన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పోర్టల్ లో లబ్ధిదారుల వివరాలు అప్​డేట్​ చేయాలన్నారు. జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

నిజామాబాద్​, వెలుగు : జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్​లో రోడ్​ భద్రతా జిల్లా కమిటీ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఆయా శాఖలు సమన్వయంతో వెళ్తే ఫలితాలు సాధించే వీలుందన్నారు. రోడ్డు ఆక్రమణలను నివారించాలని, వడ్లు, మొక్కజొన్న తదితర పంటలను రోడ్లపై ఆరబెట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయన్నారు.  

బ్లాక్​ స్పాట్స్ గుర్తింపుతో ప్రయోజనం

జిల్లాలోని నేషనల్​ హైవే 44, 63 పై యాక్సిడెంట్స్ అవుతున్నాయని సీపీ సాయి చైతన్య అన్నారు. బ్లాక్​ స్పాట్స్​ గుర్తించి తీసుకున్న చర్యలతో పరిస్థితి కొంత మారిందన్నారు. మూల మలుపులు, కల్వర్టులు, ఎత్తుపల్లాలు, రోడ్ నిర్మాణ లోపాలు యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయని సైన్​ బోర్డులు, లైటింగ్​తో నివారించవచ్చన్నారు. టౌన్​ ఏరియాలో ట్రాఫిక్ కంట్రోలింగ్ పెంచుతామన్నారు.