బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, వెలుగు : జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అరుణ ఆధ్వర్యంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడీడు పిల్లలను పనిలో పెట్టుకుంటే యజమానులపై కేసు నమోదు చేయడంతోపాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. 15 రోజుల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలతో మండల స్థాయి టాస్క్ పోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటుక బట్టీలు, ఫ్యాక్టరీలు, దుకాణాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించాలన్నారు.

 మున్సిపల్ కమిషనర్లు ట్రేడ్ లైసెన్స్, టాక్స్ వసూలు, శానిటేషన్ చేసేటప్పుడు దుకాణాల్లో బాల కార్మికులను గుర్తించాలని చెప్పారు. గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది, మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్లు.. బాల కార్మికులను గుర్తించి మండల స్థాయి టాస్క్ పోర్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. బాల కార్మికులను బడిలో చేర్పించి, వారికీ హాస్టల్ వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పోస్టర్ ను ఆవిష్కరించారు.జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవికుమార్, డీఆర్డీవో పీడీ వీవీ అప్పారావు, డీపీవో యాదయ్య, డీడబ్ల్యూవో నరసింహారావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రమణరావు, డీఎంహెచ్ వో కోటాచలం, ఇండస్ట్రీస్ జీఎం సీతారాంనాయక్, వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.