హైదరాబాద్, వెలుగు: విద్యార్థులందరికీ సమానమైన, నాణ్యమైన విద్య కామన్ స్కూల్ విద్యా విధానం ద్వారానే సాధ్యమని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి అన్నారు. తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో డీటీఎఫ్కు రాష్ట్ర ప్రభుత్వం సభ్యత్వం కల్పించినట్టు వెల్లడించారు. గురువారం హైదరాబాద్ లో ఫెడరేషన్రాష్ట్ర నేతలు రాజిరెడ్డి, సృజన, శ్రీశైలం, బాబుదొర, రామకృష్ణ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గవర్నమెంట్ ఆధీనంలోనే విద్య ఉండాలని, సర్కారు బడుల్లో వసతులు కల్పించాలని కోరారు.
తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలిచిన డీటీఎఫ్.. ఎల్లప్పుడూ వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యతతో పనిచేస్తోందని తెలిపారు. టీచర్ల సమస్యల పరిష్కారం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నామని చెప్పారు. ఇప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం లభించడంతో సర్కారు బడుల బలోపేతానికి, టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో నేరుగా చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ లో ఇంటర్ విద్యను విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కానీ, ఉద్యోగుల సర్వీస్ రూల్స్, సమస్యలపై సర్కారు స్పష్టత ఇవ్వాలని కోరారు.
