నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు

నిజామాబాద్ జిల్లా  కాంగ్రెస్ లో నేతల మధ్య  విభేదాలు కొనసాగుతున్నాయి. పీసీసీలో  తమకు పదవి  దక్కలేదని  ఇద్దరు సీనియర్  నేతలు  పార్టీ కార్యక్రమాలకు  దూరంగా ఉంటున్నారు.  కొత్తగా  పదవులు  దక్కిన నేతలు  జోష్ లో  కనిపిస్తున్నారు.

నిజామబాద్ జిల్లా కాంగ్రెస్ లో సీనియర్ నేతల అలక హాట్ టాఫిక్ గా మారింది.  జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మాజీ ఎంపీ మధుయాష్కీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. దీంతో  వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును ఆశించిన ఇద్దరు మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డీ, షబ్బీర్ అలీ కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా  ఉంటున్నారు. మహేష్ కుమార్ డౌడ్, మధుయాష్కీ పార్టీ బాధ్యతులు చేపట్టిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చినప్పుడు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సన్మాన సభకు ఇద్దరు మాజీ మంత్రులు హాజరు కాలేదు. 

సుదర్శన్ రెడ్డి.. షబ్బీర్ అలీలో ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వస్తుందని ప్రచారం జరిగింది. ఊహించని విధంగా.. మహేష్ కుమార్ గౌడ్ కు ఆ పోస్టు దక్కడంతో ఇద్దరు నేతల అనుచరులకు మింగుడు పడటం లేదు. బోధన్ లో జరిగిన సన్మాన కార్యక్రమానికి తన అనుచరులను  వెళ్లొద్దని చెప్పారని ఓ సీనియర్ నేత చెప్పినట్లు తెలుస్తోంది. కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆ సీనియర్ నేతకు నచ్చలేదని సమాచారం. బోధన్ సీటుపై కన్నేసిన.. కరుణాకర్ రెడ్డి గ్రౌండ్ వర్క్ చేస్తుండటంతో సీనియర్ నేత సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో పర్యటించిన మధుయాష్కీ గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇస్తామనడం,   పార్టీలోని ఇంటి దొంగల వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పడం ఇద్దరు  మాజీ మంత్రులకు కోపాన్ని తెప్పించిందని సమాచారం.