
- తల్లిపై కోపంతో బిడ్డ గొంతు కోసింది
- హితీక్షను చంపింది చిన్నమ్మే.. తేల్చిన కోరుట్ల పోలీసులు
- హత్య చేసి అందరితో కలిసి చిన్నారిని వెదుకుతున్నట్లు నటన
- సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు
- కుటుంబసభ్యులు తనను చిన్నచూపు చూడడం వల్లే ఈ పని చేశానంటూ విచారణలో ఒప్పుకున్న నిందితురాలు
- అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు..
కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం ఆదర్శనగర్‌లో ఐదేండ్ల చిన్నారి హితీక్ష హత్య కేసు మిస్టరీ వీడింది. ఆమెను చిన్నమ్మ మమత హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఈ కేసును ఛేదించారు. దీంతో సోమవారం మమతను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. తోడి కోడలు నవీన(చిన్నారి తల్లి)పై ఉన్న ఈర్ష్య, అసూయతోనే చిన్నారిని మమత హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ సురేశ్‌బాబు వెల్లడించారు.
ఆకుల మదన్-లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు రామ్, లక్ష్మణ్ కవల పిల్లలు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు తండ్రితో కలిసి సౌదీ వెళ్లారు. అప్పటి నుంచి నవీన(రామ్ భార్య), మమత(లక్ష్మణ్ భార్య),అత్త లక్ష్మి, ఆడపడుచు మానసతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. మమత ఆన్లైన్ బెట్టింగ్‌లో దాదాపు రూ.20 లక్షలకు పైగా పోగొట్టుకున్నది. ఈ విషయంలో కుటుంబ సభ్యులు తనను చిన్నచూపు చూడడంతోపాటు పెద్ద కోడలు నవీనకు ఇంట్లో ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని ఈర్ష్య పెంచుకున్నది. ఆమె కూడా తనలాగే బాధ పడాలని భావించింది.
శనివారం కొడుకు వేదాన్ష్, కూతురు హితీక్షను స్కూల్‌కు పంపిన నవీన.. ఆడపడుచుతో కలిసి షాపింగ్‌కు కరీంనగర్ వెళ్లింది. సాయంత్రం స్కూల్నుంచి వచ్చిన వారితోపాటు తన పిల్లలనూ మమత పులి వేషధారణలు చూసేందుకు తీసుకెళ్లింది. ఈ సమయంలో తన వెంట కత్తి, కటింగ్ ప్లేయర్‌ను తీసుకొచ్చి, సమీపంలో ఎవరూ లేని ఇంటి వద్ద ఉంచింది. మిగతా ముగ్గురు పిల్లలను అత్త దగ్గరికి పంపిన మమత.. హితీక్షను మాత్రం ఆ ఇంట్లోని బాత్రూంలోకి తీసుకెళ్లింది.
అనంతరం గొంతు కోసి, కటింగ్‌ప్లేయర్‌తో కర్కశంగా కట్ చేసింది. అక్కడి నుంచి నేరుగా తన ఇంటికి వెళ్లి రక్తపు మరకలు పడ్డ చీరను తీసేసి డ్రెస్సు వేసుకొనిఏమీ తెలియనట్లు ఉంది. మర్డర్‌కు ఉపయోగించిన కత్తి, కటింగ్‌ప్లేయర్, దుస్తులను ఇంటికి కిలోమీటర్దూరంలో ఉన్న ఓ ఫంక్షన్హాల్సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేసింది.
కీలకంగా మారిన సీసీ ఫుటేజీ
హితీక్ష బయటికి వెళ్లి ఇంటికి రాకపోయేసరికి అత్తతో పాటు నవీన, మానస వెదకడం ప్రారంభించారు. వారితోపాటు మమత కూడా కలిసి చిన్నారిని వెదికినట్లు నటించింది. చివరకు సమీపంలోని ఓ ఇంటి బాత్రూంలో హితీక్ష డెడ్‌బాడీ కనిపించింది. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా వారితోటు మమత కూడా వెళ్లింది. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలాన్ని ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ రాములు, సీఐ సురేశ్‌బాబు పరిశీలించారు. క్లూస్ టీం , డాగ్ స్వ్కాడ్ సాయంతో విచారణ చేపట్టారు. బాలిక డెడ్ బాడీ దొరికిన ఇంటి నుంచి బయలుదేరిన డాగ్ ఆ చిన్నారి ఉంటున్న ఇంటివద్దే వెళ్లి ఆగింది. దీంతో ఆమెను ఇంట్లో వారే హత్య చేసినట్లు పోలీసులు భావించి, ఇంటి ముందున్న సీసీ కెమెరాను పరిశీలించారు.
సీసీ టీవీ ఫుటేజ్‌లో పులి వేషధారుల వద్దకు పిల్లలను మమత తీసుకెళ్లినట్లు రికార్డయ్యాయి. తర్వాత ముగ్గురు పిల్లలే ఇంటికి చేరుకోగా.. మమత అనుమానాస్పదంగా పక్క ఇంట్లోకి వెళ్లి, తిరిగి బయటకు వస్తుండటం, చేతిలో కవర్ పట్టుకుని వెళ్లడం స్పష్టంగా కనిపించింది. దీంతో మమతను, కుటుంబ సభ్యులను, చుట్టుపక్కల వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్లు మమత ఒప్పుకున్నది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సురేశ్‌బాబు తెలిపారు. కాగా ఆమె అరెస్ట్‌ను పోలీసులు చివరి దాకా గోప్యంగా ఉంచారు. హితీక్ష చనిపోయిన విషయం తెలుసుకున్న తాత మదన్ , తండ్రి రాము సౌదీ నుంచి కోరుట్లకు ఆదివారం సాయంత్రం చేరుకున్నారు.