మంచిర్యాలలో ఆగని వందే భారత్ .. స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వాలని పబ్లిక్, నేతల డిమాండ్

మంచిర్యాలలో ఆగని వందే భారత్ .. స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వాలని పబ్లిక్, నేతల డిమాండ్
  • హైదరాబాద్–నాగపూర్ ​మధ్య పరుగులు పెడుతున్న రైలు
  • మంచిర్యాల నుంచి ఏటా 13 లక్షల మందికిపైగా ప్రయాణం 
  • రూ.23 కోట్ల వార్షికాదాయంతో ఎన్ఎస్​జీ 3 లిస్ట్​లో చోటు 
  • ఎన్​ఎస్​జీ 4 జాబితాలో ఉన్న రామగుండంలో హాల్టింగ్

మంచిర్యాల, వెలుగు: భారతీయ రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్​ఎక్స్​ప్రెస్ రైళ్లు దేశవ్యాప్తంగా పలు నగరాల మధ్య దూసుకెళ్తున్నాయి. 2024 సెప్టెంబర్​15న  ప్రారంభించిన 65వ వందే భారత్ ఎక్స్​ప్రెస్ ​హైదరాబాద్–నాగపూర్ మధ్య పరుగులు పెడుతోంది. ఈ రెండు సిటీల మధ్య ఐదు స్టేషన్లలో ఆగుతున్నప్పటికీ ఈ రూట్​లో ప్రధానమైన మంచిర్యాల రైల్వే స్టేషన్​లో హాల్టింగ్​ కల్పించకపోవడంపై ప్రయాణికులను తీవ్ర అసంతృప్తికి గురవుతు న్నారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు, బంధుత్వాలు ఉండడంతో ప్రతిరోజు వందలాది మంది రెండు వైపులా ప్రయాణిస్తుం టారు. ఈ క్రమంలో ఆధునిక హంగులతో నడుస్తున్న ఈ ట్రెయిన్​లో ప్రయాణించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నప్పటికీ ఆ చాన్స్​లేకపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. 

తెలంగాణలో 2, మహారాష్ట్రలో 3 స్టాప్​లు

హైదరాబాద్–నాగపూర్​ సెమీ ఎక్స్​ప్రెస్ ​ట్రెయిన్​కు తెలంగాణలో కాజీపేట, రామగుండం, మహారాష్ట్రలో బల్లార్షా, చంద్రాపూర్, సేవాగ్రామ్​లో ఐదు స్టాప్​లు మాత్రమే ఉన్నాయి. ప్రతిరోజు నాగపూర్​లో ఉదయం 5 గంటలకు స్టార్ట్​ అయ్యి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్​ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ ​నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరి రాత్రి​ 8.20 గంటలకు నాగపూర్​ చేరుకుంటుంది. మంగళవారం మినహా మిగతా ఆరు రోజులు నడస్తుంది. మొత్తం 575 కిలోమీటర్ల దూరానికి 7.15 గంటల టైమ్​ తీసుకుంటుంది. ఏసీ చైర్​కార్, ఏసీ ఎగ్జిక్యూటివ్​ చైర్​ కార్​కోచ్​లు, ఆన్ బోర్డ్​ వైఫై తదితర అత్యాధునిక సౌకర్యాలు ఉండడంతో వందే భారత్​లో ప్రయాణించేందుకు ఎదురుచూస్తున్నారు. 

రామగుండంలో స్టాప్.. మంచిర్యాలలో నో..

వందే భారత్​ఎక్స్​ప్రెస్​కు రామగుండంలో స్టాప్​ ఇచ్చి ఈ రూట్​లో ప్రధానమైన మంచిర్యాల స్టేషన్​లో హాల్టింగ్​ ఇవ్వకపోవడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టేషన్ ​నుంచి ఏటా దాదాపు 13 లక్షల మంది ప్రయాణిస్తుండగా.. సుమారు రూ.23 కోట్ల వార్షికాదాయం సమకూరుతోంది. రైల్వే శాఖ వివిధ రైల్వే స్టేషన్లను వాటి వాణిజ్య ప్రాముఖ్యత ఆధారంగా ఆరు నాన్​సబర్బన్​ గ్రేడ్ (ఎన్ఎస్​జీ)లుగా వర్గీకరించింది. ఇందులో మంచిర్యాల ఎన్ఎస్​జీ 3 జాబితాలో చోటు దక్కించుకోగా, రామగుండం ఎన్​ఎస్​జీ 4 జాబితాకే పరిమితమైంది. ఈ లెక్కన ప్రయాణికుల సంఖ్య, ఆదాయంలో మంచిర్యాల కంటే వెనుకంజలో ఉన్న రామగుండంలో హాల్టింగ్ ఇచ్చి ఇక్కడ ఆపకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

రైల్వే జీఎంకు బీజేపీ నేతల వినతి

మంచిర్యాలలో వందే భారత్ రైలు నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నగనూరి వెంకటేశ్వర్​ గౌడ్​ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల రైల్వే స్టేషన్​కు వచ్చిన జీఎం సందీప్​ మాథుర్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. మంచిర్యాల, ఆసిఫాబాద్​జిల్లాల నుంచి తిరుపతి వెళ్లే భక్తుల కోసం తిరుపతికి ట్రెయిన్​ ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఏపీ, కేరళ, సంఘమిత్ర, స్వర్ణ జయంతి ఎక్స్​ప్రెస్​లకు హాల్టింగ్​ఇవ్వాలని కోరారు.

రైల్వే మంత్రిని కోరిన పెద్దపల్లి ఎంపీ

వందే భారత్​ ఎక్స్​ప్రెస్​కు మంచిర్యాలలో హాల్టింగ్​ కల్పించేందుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ను కలిసి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సికింద్రాబాద్​ సౌత్ ​సెంట్రల్​ రైల్వే జనరల్ ​మేనేజర్​ను సైతం కలిసి మంచిర్యాలలో హాల్టింగ్​ ఇవ్వాలని కోరారు. మంచిర్యాలలో ఆపినట్లయితే వ్యాపారులు, ఎంప్లాయీస్, స్టూడెంట్లతో పాటు ఇతర అవసరాల కోసం ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని వివరించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే హాల్టింగ్​కల్పించేందుకు కృషి చేస్తానని వంశీకృష్ణ తెలిపారు.