
Rekha Jhunjhunwala: దేశీయ స్టాక్ మార్కెట్లలో చాలా మంది ఇన్వెస్టర్లు కొందరు దిగ్గజ పెట్టుబడిదారుల పోర్ట్ ఫోలియోలను గమనిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జున్‌జున్‌వాలా ఫ్యామిలో పోర్ట్ ఫోలియోను చాలా మంది గమనిస్తూ ఉంటారు. దివంగత బిగ్ బుల్ మరణం తర్వాత ఆయన భార్య రేఖా ప్రస్తుతం ఈ పెట్టుబడులకు సంబంధించిన విషయాలను పరిశీలిస్తున్నారు.
ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు తెరచుకోగానే ప్రముఖ ఇన్వెస్టర్ రేఖా జున్‌జున్‌వాలా కొన్ని నిమిషాల్లోనే దాదాపు రూ.900 కోట్ల నష్టాన్ని చవిచూశారు. దీనికి కారణంగా ఆమె హోల్డ్ చేస్తున్న టైటాన్ షేర్లే కారణంగా వెల్లడైంది. మెుదటి త్రైమాసికంలో టైటాన్ అమ్మకాలు మందగించటం, వ్యాపార పనితీరు ఇన్వెస్టర్లను నిరాశపరచటంతో నేడు స్టాక్ 5 శాతానికి పైగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రేఖా టైటాన్ కంపెనీలో 5.15 శాతం వాటాలను హోల్డ్ చేస్తున్నందున స్టాక్ పతనం పెద్ద నష్టాన్ని కలిగించిందని వెల్లడైంది.
మధ్యాహ్నం 11.45 గంటల సమయంలో టైటాన్ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో రూ.3వేల 468.50 వద్ద ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం స్టాక్ 5.4 శాతం క్షీణతతో కొనసాగుతోంది. దీని కారణంగా రేఖా పెట్టుబడి విలువ రూ.925 కోట్లు ఆవిరైంది.
ALSO READ : బంగ్లాదేశ్ పై ట్రంప్ టారిఫ్స్.. దూసుకుపోతున్న ఇండియన్ టెక్స్‌టైల్ స్టాక్స్ ఇవే..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన బంగారం ధరలతో టాటాలకు చెందిన టైటాన్, కార్ట్ లేన్ అమ్మకాల పెరుగుదల మందగించిందని బ్రోకరేజ్ సంస్థ ఎంకే గ్లోబల్ పేర్కొంది. ప్రస్తుత ధరలతో షాపులకు వస్తున్న కస్టమర్ల సంఖ్య కూడా బాగా తగ్గిందని చెప్పింది. పెరిగిన పసిడి ధరలతో వ్యాపారులు కూడా అధిక లాభాల మార్జిన్లను పొందలేకపోవటం, వ్యాపార ఆదాయాలను దెబ్బతీస్తోందని తేలింది. ఒకపక్క భారత ప్రభుత్వం కస్టమ్స్ సుంకాలను తగ్గించినప్పటికీ పెరుగుతున్న ధరలు ఆ ప్రయోజనాన్ని ఆవిరి చేస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
బ్రోకరేజీల మాట..
* టైటాన్ షేర్లకు మోతీలాల్ ఓస్వాల్ బై రేటింగ్ అందిస్తూ టార్గెట్ ధరను రూ.4వేల 250గా ఫిక్స్ చేసింది.
* ఎంకే గ్లోబల్ టైటాన్ షేర్లకు టార్గెట్ ధరను రూ.3వేల 350గా ప్రకటించింది.