ఇంటర్​ ఫస్టియర్ ఎగ్జామ్స్​పై గందరగోళం

ఇంటర్​ ఫస్టియర్ ఎగ్జామ్స్​పై గందరగోళం
  • పరీక్షలకు సహకరించ బోమన్న ప్రైవేట్ కాలేజీలు
  • ఎగ్జామ్ మెటీరియల్, క్వశ్చన్ పేపర్లు తీస్కోలే  
  • తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ 
  • ఈ టైమ్ లో ఇబ్బంది పెట్టొద్దన్న మంత్రి సబిత

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 25 నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ నిర్వహణపై అయోమయం నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఎగ్జామ్స్​ను బహిష్కరిస్తామని ప్రైవేటు జూనియర్ కాలేజీల మేనేజ్​మెంట్లు హెచ్చరించాయి. అయినా సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో డీఐఈఓలు, నోడల్ ఆఫీసర్లు నిర్వహించిన మీటింగ్​లకు డుమ్మా కొట్టాయి. ఎగ్జామ్స్ ​మెటీరియల్, క్వశ్చన్ పేపర్లను కూడా తీసుకుపోలేదు. దీంతో పరీక్షల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. మరో మూడ్రోజుల్లోనే పరీక్షలుండగా సర్కారు పెద్దలు గానీ, ఇంటర్ బోర్డు అధికారులు గానీ మేనేజ్మెంట్లతో చర్చలు జరపకపోవడం గమనార్హం.

ఫీజులు వసూలు కావట్లేదంటూ..

సోమవారం నుంచి వచ్చే నెల 3 వరకు ఫస్టియర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. 4,59,008 మంది స్టూడెంట్లు పరీక్షలకు హాజరు కానుండగా.. 1,748 సెంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో 1,150కి పైగా సెంటర్లు ప్రైవేటు కాలేజీలవే. అయితే ఈ ఏడాది ఫిజికల్ హాల్​టికెట్లు పంపించకుండా, తమ వెబ్ సైట్​నుంచి డౌన్​లోడ్ చేసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. హాల్​టికెట్​పై కాలేజీ ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదంది. దీన్ని మేనేజ్​మెంట్లు వ్యతిరేకిస్తున్నాయి. ఫీజులు వసూలు కాక బిల్డింగ్​ రెంట్లు కట్టలేకపోతున్నామని, లెక్చరర్లకు జీతాలు టైమ్​కు ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నాయి. సర్కారు నుంచి రావాల్సిన స్కాలర్​షిప్​ బకాయిలు భారీగా ఉన్నాయని, ఈ టైమ్​లో బోర్డు ఇలా నిర్ణయం తీసుకోవడం సరికాదంటున్నాయి. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఎగ్జామ్స్ ​నిర్వహణకు సహకరించబోమని అంటున్నాయి. దీనిపై బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్​కు మెమోరాండం ఇచ్చాయి. గురువారం కూడా మేనేజ్మెంట్ల సంఘం ప్రతినిధులు మంత్రి సబితారెడ్డిని కలిసి సమస్యలను వివరించారు.

సర్కారు స్పందించకపోవడంతో...

మేనేజ్​మెంట్లు హెచ్చరించినా సర్కారు నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల్లో డీఐఈవోలు, నోడల్ ఆఫీసర్లు బుధవారం నిర్వహించిన సీఎస్, డీవో, ఏసీఎస్ ల మీటింగ్​కు ఏసీఎస్ లుగా ఉన్న ప్రైవేటు కాలేజీల ప్రిన్సిపాల్స్ హాజరుకాలేదు. అన్ని జిల్లాల్లో తమ సమస్యలు పరిష్కరించాలని డీఐఈఓలు, నోడల్ ఆఫీసర్లకు వినతిపత్రాలు అందించారు. సెంటర్లకు తీసుకుపోవాల్సిన ఆన్సర్ షీట్లు, ఓఎంఆర్ షీట్లు, అటెండెన్స్ షీట్లను మెజార్టీ జిల్లాల్లో తీసుకోలేదు. గురువారం క్వశ్చన్ పేపర్లను కూడా చాలాచోట్ల ప్రైవేటు కాలేజీల ప్రతినిధులు తీసుకోలేదు. కాగా, మేనేజ్మెంట్లు ఎగ్జామ్స్ టైమ్ లో ఇలా చేయడం కరెక్టు కాదని, స్టూడెంట్లను ఇబ్బందులు పెట్టొద్దని మంత్రి సబిత సూచించారు.

ప్రతి సెంటర్​లో సీసీ కెమెరాలు: సబిత

ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ కు ఏర్పాట్లు చేస్తున్నామని  మంత్రి సబితా చెప్పారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి ఎగ్జామ్ సెంటర్​లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎగ్జామ్స్ ఏర్పాట్లపై గురువారం నాంపల్లిలోని ఇంటర్​బోర్డు ఆఫీసు నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎగ్జామ్ సెంటర్లలోకి గంట ముందే స్టూడెంట్లను అనుమతిస్తామని, వాటర్ బాటిళ్లు, శాని టైజర్లు తెచ్చుకోవచ్చని మంత్రి చెప్పారు. 

సర్కార్ స్పందించకుంటే ఎగ్జామ్స్ బహిష్కరిస్తం: టీపీజేఎంఏ

రెండున్నరేండ్లుగా సర్కార్ స్కాలర్​షిప్ లు ఇవ్వడం లేదని,  సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామని టీపీజేఎంఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గౌరీ సతీశ్, తిరుపతిరెడ్డి చెప్పారు. ఇంటర్​లో ఫీజును ఫిక్స్ చేయాలని కోరినా సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. సర్కార్ స్పందించకుంటే పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు

* అమ్మవారికి..  అగ్గిపెట్టెలో పట్టే చీర
* క్యాబ్​ డ్రైవర్లు ఆగమైతున్రు
* వివాదంలో వైరా మాజీ ఎమ్మెల్యే కొడుకు