మల్లారెడ్డి కబ్జాపై సర్కార్ యాక్షన్

మల్లారెడ్డి కబ్జాపై సర్కార్ యాక్షన్
  • కాలేజీ కోసం ప్రభుత్వ భూమిలో వేసిన రోడ్డు తొలగింపు 
  • జేసీబీలతో  తవ్వేసిన అధికారులు.. 10 గుంటలు తిరిగి స్వాధీనం 
  • హెచ్ఎండీఏ పార్క్ స్థలాన్ని ఆక్రమించుకున్న మాజీ మంత్రి 
  • గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ చేసిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు 

మేడ్చల్, వెలుగు:  మాజీ మంత్రి మల్లారెడ్డిపై వచ్చిన భూకబ్జా ఫిర్యాదుపై అధికారులు చర్యలు తీసుకున్నారు. హెచ్ఎండీఏ భూమిని ఆక్రమించుకుని తన కాలేజీ కోసం ఆయన వేసుకున్న రోడ్డును తొలగించారు. 10 గుంటల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కమలానగర్ లో హెచ్ఎండీఏ లేఅవుట్ ఉంది. 2022లో ఈ లేఅవుట్ లోని 10 గుంటల (1,250 గజాలు) పార్క్ స్థలాన్ని అప్పటి మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారు. మున్సిపాలిటీలో తీర్మానం చేసి పార్క్ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. 

తన కాలేజీకి వెళ్లేందుకు ఆ స్థలంలో రోడ్డు వేసుకున్నారు. దీనిపై అప్పటి మల్కాజ్ గిరి ఎంపీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పుడు మల్లారెడ్డి మంత్రి కావడంతో అధికారులెవరూ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మేడ్చల్ కలెక్టర్ ఆ స్థలంపై దృష్టి పెట్టారు. కబ్జాకు గురైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని, వెంటనే రోడ్డును తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధికారులు శనివారం రోడ్డును తొలగించారు. 

జేసీబీలతో రోడ్డు మొత్తం తవ్వేశారు. మల్లారెడ్డి కబ్జా చేసిన 10 గుంటలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నామని కమిషనర్ రాములు తెలిపారు. ఇది హెచ్ఎండీఏ భూమి అని, ఇక్కడి నుంచి కాలేజీకి వెళ్లేందుకు తొవ్వ లేదని స్పష్టం చేశారు. కాగా, గిరిజనుల భూములను కూడా కబ్జా చేసినట్టు మల్లారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో గిరిజనులకు చెందిన 47 ఎకరాల 18 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్టు గతేడాది డిసెంబర్ లో కేసు నమోదైంది.