- కాంగ్రెస్ పాలనలో మోసపోని వర్గమే లేదు: హరీశ్ రావు
- సనత్ నగర్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సభ
హైదరాబాద్/బేగంబజార్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే ప్రారంభమవుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో మోసపోని వర్గమంటూ ఏదీ లేదని, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది ఇలా అందరినీ రోడ్డున పడేశారని మండిపడ్డారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బుధవారం బేగంపేటలోని జొరాస్టియన్ క్లబ్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సమావేశం నిర్వహించారు.
హరీశ్‌రావు చీఫ్‌గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. కేసీఆర్ హయాంలో పేద విద్యార్థుల కోసం రూ.19 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే.. ప్రస్తుత పాలకులు నిధులు నిలిపివేయడంతో రాష్ట్రంలో దాదాపు 400 డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు మూత పడుతున్నాయన్నారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్ లో రాహుల్, ప్రియాంక గాంధీతో ప్రచారం చేయించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సాక్షిగా కేవలం 16 వేల ఉద్యోగాలే ఇచ్చామని చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, తలసాని సాయికిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మహేశ్ గౌడ్, అద్దంకిపై పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టుకు..
క్షుద్ర పూజలు చేసినట్టు ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, విప్ అద్దంకి దయాకర్‌పై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బుధవారం నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హరీశ్‌రావు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట స్టేట్‌మెంట్ ఇచ్చారు. తాను క్షుద్ర పూజలు చేసినట్టు గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మహేశ్ గౌడ్, దయాకర్ ఆరోపణలు చేశారని కోర్టుకు వివరించారు. ఈ వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని గతంలో లీగల్ నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. తన పరువుకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించినట్టు చెప్పారు.
సినీ నటుడు ప్రియదర్శికి అభినందన
సినీ నటుడు ప్రియదర్శిని హరీశ్ రావు అభినందించారు. బుధవారం హరీశ్‌రావును ఆయన నివాసంలో ప్రియదర్శి కలిశారు. ఈ సందర్భంగా ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్ పాత్రను ప్రియదర్శి చక్కగా పోషించారని, ఆయన నడక, మాటతీరు, హావభావాలను సహజంగా పండించారని ప్రశంసించారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో ఎదగడం అభినందనీయమని పేర్కొన్నారు.
సింగరేణి కరెంట్ రాజస్తాన్ కు ఎట్లిస్తరు?
మంచిర్యాల జిల్లా జైపూర్ లోని సింగరేణి థర్మల్ ప్లాంట్ విస్తరణలో ఉత్పత్తయ్యే కరెంటును రాజస్తాన్‌కు ఇచ్చేందుకు కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. అక్కడ తయారయ్యే 800 మెగావాట్ల విద్యుత్ ను వంద శాతం మన రాష్ట్ర అవసరాల కోసమే వాడుకునేలా తెలంగాణ డిస్కంలతో పీపీఏ ఒప్పందం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం బహిరంగ లేఖ రాశారు.
