- ఐదుచోట్ల బీఆర్ఎస్, మరో ఏడు చోట్ల హంగ్
- కీలకంగా మారిన బీజేపీ, ఇండిపెండెంట్కౌన్సిలర్లు
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పై చేయి సాధించింది. 19 మున్సిపాలిటీల పరిధిలో 7 చోట్ల స్పష్టమైన మెజార్టీ సాధించింది. బీఆర్ఎస్ 5 చోట్ల మెజార్టీ దక్కించుకుంది. మిగతా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. ఆయా మున్సిపాలిటీల్లో కొన్నిచోట్ల బీజేపీ కౌన్సిలర్లు, మరికొన్ని చోట్ల స్వతంత్రులు కీలకంగా మారనున్నారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో సంగారెడ్డి, సదాశివపేట, అందోల్- జోగిపేట, గడ్డపోతారం, నారాయణఖేడ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధించింది. బీఆర్ఎస్ ఒక్క గుమ్మడిదల బల్దియాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో ఐదు మున్సిపాలిటీలు జహీరాబాద్, కోహిర్, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఈ మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలకు స్వతంత్రులు కీలకంగా మారారు. కొన్నిచోట్ల బీజేపీ కౌన్సిలర్లు, మరికొన్నిచోట్ల ఇండిపెండెంట్ కౌన్సిలర్లును తమ వైపు లాగే ప్రయత్నంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు సాధించగా హంగు ఏర్పడిన ఐదు చోట్ల పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది.
మెదక్, నర్సాపూర్‌లో హంగ్..
మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా రామాయంపేటలో కాంగ్రెస్ 8 కౌన్సిలర్ స్థానాలు గెలుపొంది, తూప్రాన్‌లో బీఆర్ఎస్ 9 కౌన్సిలర్ స్థానాలు గెలుపొంది చైర్పర్సన్పదవికి అవసరమైన మెజారిటీ సాధించాయి. మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక హంగ్ ఏర్పడింది. మెదక్ లో మొత్తం 32 వార్డులు ఉండగా బీఆర్ఎస్కు15, కాంగ్రెస్‌కు14, బీజేపీకి 2, బీఎస్పీకి 1 వార్డు దక్కింది. మ్యాజిక్ ఫిగర్ ఎవరికి రాకపోవడంతో ఇద్దరు బీజేపీ, ఒక బీఎస్పీ కౌన్సిలర్ కీలకంగా మారారు.
17 వ వార్డు స్థానంలో కౌన్సిలర్ గా గెలుపొందిన బీఎస్పీ అభ్యర్థి అరుణ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య 15 కు చేరింది. ఈ పరిణామం తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సమానంగా 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. దీంతో ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరికి సపోర్ట్ చేస్తే వారికి మున్సిపల్ చైర్పర్సన్పదవి దక్కే అవకాశం ఉంది. నర్సాపూర్ మున్సిపాలిటీలో మొత్తం15 వార్డులు ఉండగా కాంగ్రెస్‌కు 6, బీఆర్ఎస్కు5, బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఏ పార్టీ కౌన్సిలర్లు ఎవరికి మద్దతిస్తారు? చైర్పర్సన్పదవి ఏ పార్టీకి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
సిద్దిపేట జిల్లాలో మిశ్రమ ఫలితాలు..
జిల్లాలోని గజ్వేల్, చేర్యాల, దుబ్బాక మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా హుస్నాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కు, ఒక్క మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు సంపూర్ణ మెజారిటీ లభించింది. హుస్నాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ నాలుగు వార్డులు గెలుచుకున్నాయి. దుబ్బాకలోని 20 వార్డులకు బీఆర్ఎస్11, కాంగ్రెస్ 4, బీజేపీ 2, ఎఐఎఫ్ బీ 1, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచారు.
చేర్యాల మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులకు బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5 వార్డులను గెలుచుకున్నాయి. గజ్వేల్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 7, బీజేపీ 1, ఇండిపెండెంట్ ఒక వార్డులో విజయం సాధించారు. జల్లాలోని మూడు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలుచుకున్నా మొత్తం వార్డులతో పోలిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ జరిగింది. జిల్లాలో మొత్తం 72 వార్డుల్లో బీఆర్ఎస్ 33, కాంగ్రెస్ 32, బీజేపీ 3, ఇండిపెండెంట్లు 3, ఎఐఎఫ్బీ ఒక్క వార్డును గెలుచుకున్నాయి.
