కాంగ్రెస్దే హవా.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో 12 కైవసం 

కాంగ్రెస్దే హవా.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో 12 కైవసం 
  • సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్​లోని కోస్గి మున్సిపాలిటీలో కాంగ్రెస్​ క్లీన్​ స్వీప్​
  • నారాయణపేటలో హంగ్, క్యాంప్​నకు బీజేపీ కౌన్సిలర్లు

మహబూబ్​నగర్/నారాయణపేట/వనపర్తి/గద్వాల/, నాగర్​కర్నూల్/ మహబూబ్​నగర్​ అర్బన్, వెలుగు: అధికార కాంగ్రెస్​ పార్టీ ‘పుర’ పోరులో సత్తా చాటింది. మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లోని మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా.. జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం కొంత వెనుకబడింది. మిగతా చోట్ల అధికారాన్ని చేజిక్కించుకొని పుర పీఠాలపై కాంగ్రెస్​ జెండాను ఎగురవేసింది. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని 18 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్​కు ఎన్నికలు జరుగగా..  శుక్రవారం విడుదలైన ఫలితాల్లో 12 చోట్ల పైచేయి సాధించింది.

11 మున్సిపాల్టీల్లో వార్​ వన్​ సైడ్..​

ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో అధికార పార్టీ విజయం సాధించగా.. 11 చోట్ల ఏకపక్షంగా పుర పీఠాలను దక్కించుకుంది. ఒక్క దేవరకద్ర మున్సిపాలిటీలో బీఆర్​ఎస్, కాంగ్రెస్​, బీజేపీ మధ్య నెక్​ టు నెక్​ ఫైట్​ నడవగా.. కాంగ్రెస్​ ఆరు, బీఆర్ఎస్​ నాలుగు, బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్(కాంగ్రెస్​ రెబల్) ఒకరు గెలుపొందారు. అయితే హంగ్​ ఏర్పడుతుందని అందరూ భావించగా.. సాయంత్రం ఇండిపెండెంట్​గా గెలిచిన అభ్యర్థి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్​రెడ్డిని వెళ్లి కలిశారు. అనంతరం కాంగ్రెస్​కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో అధికార పార్టీ పుర పీఠాన్ని కైవసం చేసుకుంది. మిగతా 11 మున్సిపాలిటీల్లో బీఆర్​ఎస్​, బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. 

కొన్ని మున్సిపాలిటీల్లో ఈ రెండు పార్టీలు సింగిల్​ డిజిట్​కే పరిమితం కాగా.. కోస్గి, మద్దూరు, పెబ్బేరు, నాగర్​కర్నూల్, కొల్లాపూర్, అలంపూర్, వడ్డేపల్లి, అయిజ పురపాలికల్లో బీజేపీ ఖాతా కూడా తెరవలేదు. నారాయణపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగగా కోస్గి, మద్దూరు, మక్తల్, మహబూబ్​నగర్​ జిల్లాలోని దేవరకద్ర, భూత్పూర్, నాగర్​కర్నూల్​ జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్​కర్నూల్, వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, పెబ్బేరు, కొత్తకోట, వనపర్తి మున్సిపల్​ పీఠాలను కాంగ్రెస్​ దక్కించుకుంది. 

జీఎంఆర్​ వన్​ మెన్​ షో..

మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్​ రెడ్డి వన్​ మెన్​ షో ప్రదర్శించారు. ఆయన నియోజకవర్గంలోని దేవరకద్ర, భూత్పూర్​, కొత్తకోట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. అయితే ప్రతిపక్షాలు కాంగ్రెస్​ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డాయి. చివరకు లోపాయి'కారు' ఒప్పందాలు చేసుకున్నా ఫలితాలను రాబట్టలేకపోయాయి. ఈ మున్సిపాలిటీల్లో పోలింగ్​ ఒక రోజు ముందు వరకు ఆ రెండు పార్టీలకు చెందిన లీడర్లు చెట్టాపట్టాల్​ వేసుకొని తిరుగుతూ.. తామే గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేశారు. పోలింగ్​ రోజు పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసినా చివరకు ఓటర్లు భిన్నమైన తీర్పు ఇవ్వడంతో నిరాశలో మునిగిపోయారు. 

మక్తల్​లోనూ కాంగ్రెస్సే..

పోలింగ్​కు ఒక రోజు ముందు మక్తల్​ మున్సిపాల్టీలోని ఆరో వార్డుకు చెందిన బీజేపీ క్యాండిడేట్​ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యకు కాంగ్రెస్​ పార్టీ నాయకులే కారణమని బీజేపీ లీడర్లు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికితోడు ఈ మున్సిపాల్టీలోనూ లోపాయి ‘కారు’ ఒప్పందాలు చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. కానీ, ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. మెజార్టీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని అందరూ భావించగా.. ఏకపక్షంగా ఓటర్లు కాంగ్రెస్​ పార్టీకి పట్టం కట్టారు. మంత్రి వాకిటి శ్రీహరి మూడు రోజులుగా స్థానికంగానే ఉంటూ.. కాంగ్రెస్​ గెలుపులో కీ రోల్​ పోషించారు.

పాలమూరు, నారాయణపేటలో ఖాతా తెరవని బీఆర్ఎస్..​

మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లోని మద్దూరు, కోస్గి, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, భూత్పూర్​ మున్సిపాలిటీల్లో ఒక్క చోట కూడా బీఆర్ఎస్​ చైర్మన్​ పీఠాలను దక్కించుకోలేదు. తాజా ఎన్నికల్లో బీజేపీ నారాయణపేట పీఠాన్ని కైవసం చేసుకొనే ప్రయత్నం జరుగుతుండగా, గతంలో సిట్టింగ్​ స్థానంలో ఉన్న మక్తల్​ పీఠాన్ని బీఆర్ఎస్​ చేజార్చుకుంది.
నడిగడ్డలో రసవత్తర పోరు

గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులు ఉండగా కాంగ్రెస్ కు 16, బీఆర్ఎస్ కు 11, బీజేపీ 7, ఇండిపెండెంట్​ అభ్యర్థులు రెండు చోట్ల, ఎంఐఎం అభ్యర్థి ఒకచోట గెలుపొందారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్​ ఏర్పడింది. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు ఎంఐఎం కౌన్సిలర్ తో కలిపి చైర్​పర్సన్  స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

క్యాంప్​నకునారాయణపేట బీజేపీ కౌన్సిలర్లు

నారాయణపేట జిల్లాలో హంగ్​ ఏర్పడింది. ఈ మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా, 11 వార్డుల్లో బీజేపీ, ఏడు వార్డుల్లో కాంగ్రెస్​, రెండు వార్డుల్లో బీఆర్​ఎస్, రెండు వార్డుల్లో ఎంఐఎం, ఆల్​ ఇండియా ఫార్వర్డ్​ బ్లాక్​(ఏఐఎఫ్​బీ) ఒకటి, ఇండిపెండెంట్​ ఒక స్థానంలో గెలిచారు. మ్యాజిక్​ ఫిగర్​ 13 స్థానాలు కావడంతో చైర్మన్​ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఇండిపెండెంట్​గా గెలిచిన కౌన్సిలర్​ బీజేపీకి రెబల్​గా పోటీ చేశాడు. ఈయన ఆ పార్టీకే మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. అలాగే బీఆర్ఎస్​కు చెందిన ఇద్దరు కౌన్సిలర్ల మద్దతును కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారభించింది. ఆ పార్టీ నుంచి గెలిచిన 11 మంది కౌన్సిలర్లు చేజారిపోకుండా ఫలితాలు వెల్లడైన వెంటనే బీజేపీ క్యాంపునకు తరలించింది.  కాంగ్రెస్​కు ఎంఐఎం మద్దతు తెలుపడంతో మిగతా ఐదు మంది మద్దతును కూడగట్టేందుకు చర్చలు ప్రారంభించింది.