వరంగల్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

వరంగల్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

వరంగల్ అర్బన్ జిల్లాలో  కరోనా మరోసారి విజృభిస్తోంది. వైరస్  భారిన పడి హాస్పిటల్ లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో రోజుకు 200 నుంచి 300 వరకూ కరోనా బాధితులు ఎంజీఎంకు వచ్చేవారు. నెల రోజుల క్రితం  వరకూ కేసుల సంఖ్య తగ్గడంతో  కొవిడ్ బెడ్స్ 800 నుంచి  250 బెడ్స్ కు తగ్గించారు.  వైరస్ ప్రభావం తక్కువగా ఉండటంతో జనం సాధారణ జీవితానికి అలవాటుపడ్డారు. మళ్లీ వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు,  రాకపోకలు...ఫంక్షన్లు యదావిధిగా జరుగుతున్నాయి. దీంతో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయంటున్నారు డాక్టర్లు.

 ప్రస్తుతం వరంగల్ ఎంజిఎం హాస్పిటల్  లో కోవిడ్ వార్డులో 250 బెడ్స్ కు 200 వరకూ నిండిపోయాయి. రోజూ 30 నుంచి 40 మంది వరకూ వైరస్ తీవ్రతతో  జాయిన్ అవుతున్నారు. వీరిలో కొందరికి  వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్ లో  ఒక్కరు జాయిన్ అవుతున్నారంటే బయట వంద మంది ఉన్నట్లుగానే భావించాలని అంటున్నారు ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్.  కరోనా జాగ్రత్తలు పాటించకుండా జనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ముందుగానే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు.