హైదరాబాద్: జనవరి 25 లేదా 26న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం (జనవరి 20) నర్సాపూర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు.
ప్రజల్లో ఉన్న గెలుపు గుర్రాలకే చాన్స్ ఇస్తామని చెప్పారు. అసమ్మతి నేతల పోరు ఉండకూడదన్నారు. కాంగ్రెస్ చేస్తోన్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేడర్‌కు సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కూడా కాంగ్రెస్ మొదట కాస్తా వెనకంజలో ఉందని.. కానీ చివరకు జూబ్లీహిల్స్ బై పోల్ గెలిచి చూపించామని అన్నారు. కానీ నర్సాపూర్ అలా కాదని.. ఇక్కడ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ ఉందన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు.
