20 రోజులుగా వరుస వానలు.. భూపాలపల్లి జిల్లాలో దెబ్బతింటున్న పంటలు

20 రోజులుగా వరుస వానలు.. భూపాలపల్లి జిల్లాలో దెబ్బతింటున్న పంటలు
  • ఎక్కడ చూసినా పత్తి పంటకు జాలు 
  • మిరప తోటలపై నత్తల దాడి 
  • ఆందోళనలో రైతులు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: వరుస వానలు రైతుకు కంటిమీద కూనుకు లేకుండా చేస్తున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో వదలకుండా పడుతున్న వానలతో పత్తి క్షేత్రాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లు నిలిచి జాలువారుతున్నాయి. గుంటుకలు తిరగకుండా వానలు దంచి కొడుతుండటంతో పంట క్షేత్రాలు గడ్డికంచెలను తలపిస్తున్నాయి. వేలకువేలు పెట్టుబడి పెట్టిన రైతులు పంట చేతికందే సమయంలో కురుస్తున్న వర్షాలతో నష్టం తప్పదా అంటూ ఆందోళన చెందుతున్నారు. 

రైతన్న దిగాలు...

రెండేండ్లుగా మిరప సాగుతో తీవ్ర నష్టాన్ని చూసిన రైతులు పత్తి సాగుకు మొగ్గుచూపారు. ఈ ఏడాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా సుమారు 90 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కానీ, అధిక తేమను తట్టుకోలేని బీటి విత్తనాలు వర్షాల కారణంగా ఎదుగుదల నిలిచి పోయింది, ఆకులు ఎర్రబడి పత్తి పంట దెబ్బతిన్నది. భూమిలో తేమ ఆరకుండా 20 రోజులుగా ప్రతిరోజు వర్షం కురుస్తుండడంతో గడ్డి మొలకలు పెరిగి పూలు పూస్తున్నాయి. 

రెండు రోజులుగా కాటారం డివిజన్ పరిధి మహాముత్తారం, మల్హర్, మహాదేవపూర్ లో వానలు దంచి కొడుతుండడంతో పత్తి పంటలు నీళ్లలోనే కనిపిస్తున్నాయి. వర్షాలకు పత్తి కాయలు నల్లబడి పూత, పిందెలు రాలుతున్నాయి. మోడు బారిన పచ్చని చెట్లు తప్ప పంట దిగుబడి చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతన్నలు దిగులు చెందుతున్నారు.

కాండం నములుతున్న నత్తలు..

వరుస వర్షాలతో ఎప్పుడూ లేనివిధంగా పంట క్షేత్రాల్లో నత్తలు కనిపిస్తున్నాయి. రెండేండ్లుగా పంట పొలాల్లో నత్తలు విపరీతంగా ఉండడంతో  తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని రైతులు చెబుతున్నారు. ప్రకృతి విపత్తులకు తోడు నత్తలు పంటలను ధ్వసం చేస్తుండడంతో రైతులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. నత్తలు మిరప పంటలను కాండం వద్ద నములుతుండటంతో పంటల ఎదుగుదల నిలిచిపోతుందని రైతులు పేర్కొంటున్నారు. 

నత్తల బెడదను నివారించుకునేందుకు రైతులు విష గుళికలు చల్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు ఇప్పటికే రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టినా సరైన దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బ్రాండెడ్ విత్తనాలతో మిరప సాగు చేపడితే నత్తలు, ఎర్రనల్లితో పంటలు ఎదుగుదల నిలిచిపోయిoదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలతో కలుపు సమస్య తీవ్రమై నీళ్లు నిలిచి మిరప చెట్లు చనిపోతున్నాయి.