కష్టాల్లో పత్తి రైతు.. ఇటు కూలీల కొరత.. అటు సీసీఐ కొర్రీలు

కష్టాల్లో పత్తి రైతు.. ఇటు కూలీల కొరత..  అటు సీసీఐ కొర్రీలు
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కపాస్​ కిసాన్​యాప్​పై అవగాహన కరువు
  • మాయమాటలతో రైతులను ముంచుతున్న దళారులు
  • తక్కువ ధరకు పత్తి అమ్ముకొని నష్టపోతున్న రైతులు 

భద్రాచలం, వెలుగు :  పత్తి రైతును ఈ ఏడాది కష్టాలు చుట్టుముట్టాయి. ఒకవైపు ప్రకృతి ప్రకోపం, మరోవైపు కూలీల కొరత, సీసీఐ కొర్రీలు, దళారీల ఇష్టారాజ్యం, కపాస్​ కిసాన్​ యాప్​పై అవగాహన లేమి వెరసి రైతులు నష్టాల్లోకి కూరుకుపోతున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాది 2.25లక్షల ఎకరాల్లో పత్తిపంటను సాగు చేశారు. ఆళ్లపల్లి, గుండాల, ములకలపల్లి, చర్ల, దుమ్ముగూడెం, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వాపురం, సుజాతనగర్, జూలూరుపాడు, బూర్గంపాడు మండలాల్లో పత్తి సాగు అయ్యింది.

సాగు చేసిన కాలం మొదలు అక్టోబర్​ వరకు వర్షాలు, వరదలు కారణంగా తెగుళ్లు, కాయ నల్లగామారడం, పత్తి కారిపోవడం లాంటి సమస్యలతో సతమతమయ్యారు. పంటను కాపాడుకోవడానికి సర్వం ధారపోశారు. పెట్టుబడులు పెరిగాయి. యూరియా ధర పెరిగినా వెనుకాడలేదు. దిగుబడులు వచ్చేసరికి సరికొత్త సమస్యలు పత్తిరైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 

పత్తి అమ్మేందుకూ పాట్లే..!

ఇంత కష్టపడి పత్తి తీసి తీరా మార్కెట్​కు తీసుకెల్దామంటే సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. తేమశాతం కారణంగా మద్దతు ధర పొందేందుకు అగచాట్లు పడుతున్నారు. కేంద్రం రూ.8,110 క్వింటాకు ఇస్తోంది. కపాస్​ కిసాన్​అనే యాప్​ను ప్రవేశపెట్టింది. ఈ యాప్​ను రైతులు డౌన్​లోడ్​ చేసుకోవాలి. 

అందులో రైతు పేరు, పట్టాదారు పాసు పుస్తకం వివరాలు, ఫోన్​ నెంబర్, బ్యాంక్​ అకౌంట్​నెంబర్, పంట సాగు వివరాలు అన్నీ అప్​లోడ్ చేయాలి. ఎకరానికి 7 క్వింటాళ్లు పరిమితిని విధించారు. కానీ మారుమూల గ్రామాల్లో సిగ్నల్స్ లేక యాప్​లో అప్​లోడ్​ చేయడానికి అవస్థలు పడుతున్నారు. మరోవైపు దీనిపై సరైన అవగాహన లేని గిరిజన రైతులు దళారీల బుట్టలో పడుతున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లకు దీనిపై ట్రైనింగ్​ ఇచ్చినా వారు మాత్రం రైతులకు ఎలాంటి అవగాహనను కల్పించడం లేదు. 

కనీసం కూలీల ఖర్చులకైనా వస్తాయని రైతులు ఊళ్లలోకి వచ్చే దళారీలకు అమ్మేస్తున్నారు. వారు రూ.5వేలకు మించి ధరను ఇవ్వడం లేదు. భద్రాచలం మన్యంలోని పినపాక, భద్రాచలం నియోజకవర్గాలలోని పత్తి రైతులు అశ్వాపురం మండలంలోని నెల్లిపాక బంజర జిన్నింగ్​ మిల్లులోని సీసీఐ కేంద్రానికి పత్తిని తీసుకొస్తారు. కానీ ఇక్కడ బయ్యర్లు కొర్రీలు పెడుతున్నారు. తేమ శాతం విషయంలోనే మెలిక పెడుతున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ కేవలం 1,689 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. బయ్యర్ల కారణంగా పత్తిని రైతులు వెనక్కు తీసుకుపోతున్నారు. 

కానీ అదే పత్తిని వ్యాపారులు గ్రామాల నుంచి తెస్తే మాత్రం అభ్యంతరం చెప్పడం లేదు. ఈ కేంద్రంలో గత సంవత్సరం లక్ష క్వింటాళ్లు కొనుగోలు చేశారు. కానీ ఈసారి 50వేల క్వింటాళ్లు అయినా కొనుగోలు చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా వరకు దళారులు వరంగల్, కరీంనగర్​ తదితర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. దీనిపై వ్యవసాయశాఖ, వ్యవసాయ మార్కెట్​ కమిటీలు అలర్ట్​ కావాల్సిన అవసరం ఉంది. రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, సీసీఐకి తీసుకొచ్చేలా చైతన్యపరచాలి. వారిలో ధైర్యం నింపాలి. లేకపోతే మరింత నష్టాల పాలు కావాల్సి వస్తుందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కూలీల కొరతతో తీవ్రం...!

పత్తిని తీయడానికి గతంలో కూలీలు కిలోకు రూ.12లు కూలీ తీసుకుని ఒక్క రోజులో 40 నుంచి 100 కిలోల వరకు తీసేవారు. కానీ ఈసారి వీళ్లు కూడా సిస్టం మార్చారు. కూలీ కింద రోజుకు రూ.300 ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. అలా వచ్చిన వారు కేవలం 10 నుంచి 20 కిలోలు మాత్రమే తీస్తున్నారు. 

దీనివల్ల రైతుపై భారం పడుతోంది. పత్తితీతకే ఎకరానికి రూ.3వేలు, రవాణా ఖర్చులు అదనంగా రూ.500 అవుతున్నాయి. కూలీల కొరత కారణంగా చత్తీస్​గఢ్​, ఒడిశాతో పాటు ఏపీలోని మార్కాపురం, ఒంగోలుల నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. అలా వచ్చిన కూలీలకు రవాణా ఖర్చులు, స్థానికంగా వసతి, నిత్యావసర వస్తువులు కల్పించడం కూడా రైతులదే బాధ్యతగా ఉంటుంది.