
తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ మధ్యప్రదేశ్ చింద్వారాలో పిల్లల మరణాలకు సంబంధించి కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ తయారు చేసిన కంపెనీపై జరిపిన దాడిలో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు టీం సిరప్ తయారీ ఫ్యాక్టరీని పరిశీలించగా 350కి పైగా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. అలాగే ఫ్యాక్టరీలో శుభ్రత లేదని, మురికిగా ఉన్న చోట సిరప్‌ను తయారు చేస్తున్నారని స్పష్టమైంది. దీనితో పాటు కంపెనీలో స్కిల్డ్ వర్కర్స్, మెషీన్స్, ఫెసిలిటీస్, అవసరమైన పరికరాలు లేవని కనిపెట్టింది.
ఈ సిరప్‌లో ప్రమాదకరమైన రసాయనాలు ప్రొపైలిన్ గ్లైకాల్, డైథిలిన్ గ్లైకాల్ ఉన్నట్లు కనిపెట్టారు. ప్రొపైలిన్ గ్లైకాల్ అనేది సాధారణంగా ఆహారం, మందులు, కాస్మెటిక్స్‌లో కలిపే తక్కువ ప్రమాదకరమైన ద్రవమ్. కానీ, ఎక్కువ మోతాదులో లేదా ఎక్కువ కాలం పాటు వాడితే అది విషంగా మారుతుంది. మరో విషయం ఏమిటంటే, కంపెనీ ఇన్‌వాయిస్ లేకుండా 50 కిలోల ప్రొపైలిన్ గ్లైకాల్ కొన్నట్టు బయటపడింది.
దగ్గు సిరప్‌లో విష రసాయనాలు: ప్రొపైలిన్ గ్లైకాల్‌కు బదులుగా డైథిలిన్ గ్లైకాల్ వాడటం ఎక్కువగా జరుగుతోంది. దీనివల్లే పిల్లల మరణాలు జరిగాయి. డైథిలిన్ గ్లైకాల్‌ను సాధారణంగా బ్రేక్ ఫ్లూయిడ్, పెయింట్స్, ప్లాస్టిక్ వంటి పరిశ్రమ ఉత్పత్తుల్లో వాడుతారు, కానీ ఆహారం లేదా మందుల్లో వాడకూడదు.
ALSO READ : తెలుగు రాష్ట్రాల్లో వీ కేర్ సీడ్స్ పై ఐటీ సోదాలు..
ప్రొపైలిన్ గ్లైకాల్ కంటే డైథిలిన్ గ్లైకాల్ మనిషి శరీరానికి ఎక్కువ ప్రమాదకరమైనది. ఈ దగ్గు సిరప్ తాగడం వల్ల మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఇప్పటివరకు ఐదేళ్ల లోపు పిల్లలతో సహా సుమారు 15 మంది పిల్లలు మరణించారు.
మధ్యప్రదేశ్‌లో 14 మంది పిల్లలు చనిపోయిన తర్వాత కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ వాడకం, అమ్మకాలను పలు రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయి. కేరళలో 12 సంవత్సరాలలోపు పిల్లలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు ఇవ్వకూడదని ఆరోగ్య శాఖ ఆదేశాలు ఇచ్చింది.
కర్ణాటక ఆరోగ్య శాఖ రెండు ఏళ్లలోపు పిల్లలకు దగ్గు, జలుబు సిరప్‌లను ఇవ్వవద్దని ఆసుపత్రులు, క్లినిక్‌లను కోరింది. జార్ఖండ్ రాష్ట్రం కూడా కోల్డ్‌రిఫ్, రెస్పిఫ్రెష్, రిలైఫ్ అనే మూడు దగ్గు సిరప్‌ల అమ్మకం, కొనుగోలు సహా వాడకాన్ని నిషేధిస్తూ కఠిన చర్య తీసుకుంది.