చరిత్రలను హైజాక్ చేస్తున్న బీజేపీ : కూనంనేని

చరిత్రలను హైజాక్ చేస్తున్న బీజేపీ : కూనంనేని
  • వర్గ పోరాటాన్ని రెండు మతాల మధ్య ఉద్యమంగా చిత్రీకరిస్తున్నది: కూనంనేని
  • ట్యాంక్ బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రెడ్ ఫ్లాగ్ మార్చ్

ట్యాంక్ బండ్, వెలుగు: ఏ చరిత్ర లేని బీజేపీ.. అందరి చరిత్రలు తనదంటూ దుష్ట రాజకీయాలు చేస్తూ చరిత్రలను హైజాక్ చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 77వ వారోత్సవాల సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ట్యాంక్ బండ్‌‌‌‌‌‌‌‌పై రెడ్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాంబశివరావు హాజరై సాయిధ పోరాటంలో ఒకరైన మగ్దూం మొహియుద్దీన్ విగ్రహానికి పార్టీ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజిత్‌‌‌‌‌‌‌‌తో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజేపీ మతం రంగు పులుముతూ చరిత్రను వక్రీకరిస్తోందని ధ్వజమెత్తారు. 

సాయిధ పోరాట కాలం నాటికి అసలు ఉనికే లేని బీజేపీ.. విమోచన దినోత్సవం పేరుతో సెప్టెంబర్ 17న ఉత్సవాల నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. వర్గ పోరాటాన్ని రెండు మతాల మధ్య ఉద్యమంగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. కమ్యూనిస్టుల చరిత్ర చెబితే చెరిగిపోయేది కాదని.. అమరుల త్యాగాలకు ఎవరు వెలకట్టలేరన్నారు. ఈ కార్యక్రమంలో పల్ల వెంకట్ రెడ్డి, ఈటీ నరసింహ, స్టాలిన్, ఛాయాదేవి, వెంకటేశం, ప్రేమ్ పావని, నరసింహ తదితరులు పాల్గొన్నారు.