
- రెండు సంస్థలతో ఎంఓయూ చేసుకున్న సీఎస్‌బీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధునాతన టెక్నాలజీని వినియోగిస్తోంది. ఇందులో భాగంగా టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ నేతృత్వంలో గూగుల్, అరెటే సంస్థలతో గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు గూగుల్ తన క్లౌడ్ ఆధారిత సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్(ఎస్‌ఓసీ) గూగుల్ సెక్ ఓప్స్ ను సీఎస్‌బీ ఆపరేషన్లకు ఉచితంగా అందిస్తుంది.
గూగుల్ క్లౌడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇలోయిస్ డిజిటల్ ద్వారా 24 గంటల పాటు సైబర్ మానిటరింగ్, రియల్ టైమ్ నెట్‌వర్క్ డేటా విశ్లేషణ, మాలిషియస్ బిహేవియర్‌ను గుర్తించనున్నారు. అరెటే సంస్థ కూడా ఈడీఆర్ ( ఎండ్పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ ) సేవలు అందించనుంది. ఈ ఎంఓయూలు మూడేండ్ల పాటు అమలులో ఉంటాయి. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి రాష్ట్ర పోలీసులకు ఈ సంస్థలు ట్రైనింగ్ ఇస్తాయి. ఈ కార్యక్రమంలో టీజీసీఎస్‌బీ ఎస్పీ హర్షవర్ధన్, ఇలోయిస్ డిజిటల్, అరెటే ప్రతినిధులు పాల్గొన్నారు.