
తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యూకే పర్యటిస్తున్నారు. కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం యూకేలో రెండో రోజు పర్యటిస్తోంది. మే 13వ తేదీ శనివారం భారీ పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్‌లో గ్లోబల్ లీడర్ అయిన DAZN సంస్థ హైదరాబాద్‌లో తమ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో తెలంగాణలో నిరుద్యోగ యువతకు 1000 ఉద్యోగాలు కల్పించబోతోంది.
లండన్‌లో కేటీఆర్, DAZN గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సందీప్ టీకు మధ్య జరిగిన సమావేశం తర్వాత ఈ ప్రకటన చేశారు. ఇన్నోవేషన్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌లో తెలంగాణకు పెరుగుతున్న ఉనికికి DAZN పెట్టుబడి నిదర్శనమన్నారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ డైరెక్టర్ కొణతం దిలీప్, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి తదితరులు పాల్గొన్నారు.