సరయూ నదీతీరంలో దీపోత్సవ్​... దేదీప్యమానంగా అయోధ్య నగరం

సరయూ నదీతీరంలో దీపోత్సవ్​... దేదీప్యమానంగా అయోధ్య నగరం

యావత్‌ దేశం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి (Ram Lalla) కొలువుదీరిన తరువాత రామమందిరంతో పాటు సరయూ నదీతీరం దీపోత్సవ్​ కార్యక్రమంతో  దేదీప్య మానంగా వెలిగిపోయింది. దేశవ్యాప్తంగా రామనామం మారుమోగిపోయింది.  గర్భగుడిలో కొలువుతీరిన బాలరాముడిని చూసి భక్తులు పులకరించిపోతున్నారు.

14లక్షల ప్రమిదల కాంతులు  

 అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తరువాత  సరయూ నదీ తీరంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో దీపోత్సవం నిర్వహించారు. సరయూ నది తీరంలో న దీపోత్సవం కన్నులపండగగా సాగింది. సరయూ నది తీరాన భక్తులు 14 లక్షల దీపాలు వెలిగించారు. దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలతో దీపాలంకరణ చేశారు. అటు.. జనక్‌పూర్ ధామ్‌లోని జానకి ఆలయంలో కూడా దీపోత్సవం నిర్వహించారు. ఆ సమయంలోనే.. అయోధ్యలోని హనుమాన్‌గర్హి ఆలయంలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు తమ ఇళ్లలో దీపాలను వెలిగించి రామభక్తిని చాటుకున్నారు.

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా దీపాలను వెలిగించారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో దీపావళి తరహా సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నివాసం మొత్తం దీపాలతో వెలిగిపోయింది. ప్రధాని మోదీ కూడా దీపం వెలిగించారు.  నగరంలోని 100 ఆలయాలు, ప్రధాన ప్రాంతాల్లో ఈ దీపాలను వెలిగించారు.  ఈ దృశ్యాలు కనులకు పండుగే అనడంలో సందేహం లేదు. భవ్య రామమందిరంతోపాటు రామ్‌ కీ పైడీ, కనక్‌ భవన్, గుప్తార్‌ ఘాట్, సరయూ ఘాట్, లతా మంగేష్కర్‌ చౌక్, మణిరామ్‌ దాస్‌ చౌనీ తదితర ప్రాంతాల్లో ప్రమిదలు వెలిగించారు. దాంతో అయోధ్యాపురం కాంతిమయం అయింది.  

అయోధ్యలోని రామ్‌లల్లా ప్రతిష్ఠా మహోత్సవానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, పలువురు ప్రముఖులు దీక్షా కార్యక్రమానికి హాజరయ్యారు.  ఈ రోజు జరిగిన దీపోత్సవ వేడుకలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ్ ఆలయంలో దీపాలు వెలిగించారు. ప్రాణ ప్రతిష్ఠానంతరం అయోధ్యలోని సరయూ ఘాట్‌లో సంధ్యా హారతి నిర్వహించారు.