న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో 17 నెలల నుంచి ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. దాదాపు సంవత్సరంనర పాటు జైలులో ఉన్న సిసోడియాకు ఇన్నాళ్లకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్కు పాల్పడారనే అభియోగాలతో ఆయనను అరెస్ట్ చేశారు.
2023, ఫిబ్రవరి 26వ తేదీన మనీష్ సిసోడియాను సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. మార్చి 9వ తేదీ రాత్రి అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు. ఇదే కేసులో ప్రస్తుతం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత తీహార్ జైలులోనే ఉన్న సంగతి తెలిసిందే. మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ షరతులివే..
- సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో బెయిల్
- పాస్ పోర్టు సరండర్ చేయాలని ఆదేశం
- ప్రతి సోమవారం విచారణకు హాజరు కావాలని కండీషన్
- అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు