న్యూఢిల్లీ: ఇండియాపై అమెరికా కక్ష కట్టినట్లే ఉంది. ఇటీవల అగ్రరాజ్యం వ్యవహరిస్తోన్న తీరు చూస్తుంటే అట్లే అనిపిస్తోంది. ఒకవైపు సుంకాల పేరుతో ఇండియాపై ట్రంప్ ఇష్టారీతిన టారిఫ్స్ విధిస్తుంటే.. మరోవైపు భారతీయ విద్యార్థులపై అమెరికా కఠిన ఆంక్షలు విధిస్తుంది. తాజాగా మరోసారి ఇండియన్ స్టూడెంట్స్కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది.
ఈ మేరకు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం (జనవరి 7) ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే దేశ బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అమెరికాలోకి ప్రవేశించడం ఒక హక్కు కాదని.. వీసా హోల్డర్లందరూ స్థానిక చట్టాలు, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని నొక్కి చెప్పింది.
►ALSO READ | పిల్లల వ్యాక్సిన్లపై అమెరికా సంచలన నిర్ణయం.. ఆస్పత్రుల పాలు చేయడానికే అంటూ డాక్టర్ల ఆందోళన
‘‘యుఎస్ చట్టాలను ఉల్లంఘించడం మీ స్టూడెంట్ వీసాపై తీవ్ర పరిణామాలు చూపించవచ్చు. రూల్స్ బ్రేక్ చేసి అరెస్ట్ అయినా, ఏదైనా చట్టాలను ఉల్లంఘించినా మీ వీసా రద్దు కావొచ్చు. దేశం నుంచి మిమ్మల్ని బహిష్కరించవచ్చు. అలాగే.. భవిష్యత్తులో యుఎస్ వీసాలకు మీరు అనర్హులుగా మారవచ్చు. నియమాలను పాటిస్తూ మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేయకండి. యుఎస్ వీసా అనేది ఒక ప్రత్యేక హక్కు, పూర్తి హక్కు కాదు’’ అని యుఎస్ ఎంబసీ పేర్కొంది. అమెరికాలో ఉన్న సమయంలో విద్యార్థులు జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ఉండాలని సూచించింది.
ట్రంప్ రెండో అమెరికా పగ్గాలు చేపట్టాక కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో స్టూడెంట్ వీసా ఒకటి. స్టూడెంట్ వీసా ఫీజులను భారీగా పెంచడం, తప్పనిసరి సోషల్ మీడియా తనిఖీ వంటి కఠిన ఆంక్షలు విధించారు. ట్రంప్ పరిపాలన ఆంక్షలతో స్టూడెంట్స్ అమెరికా వెళ్లడం కష్టతరంగా మారింది.
