ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..27 మంది సజీవదహనం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..27 మంది సజీవదహనం

ఢిల్లీ అగ్నిప్రమాదం ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాలు, రూటర్ ఆఫీస్ ఓనర్లు హరీశ్ గోయల్, వరుణ్ గోయల్ ను అదుపులోకి తీసుకున్నారు. బిల్డింగ్ ఓనర్ మనీష్ లక్రా పరారీలో ఉన్నారు. అగ్నిమాపక శాఖ నుంచి సేఫ్టీ క్లియరెన్స్ లేదని... గుర్తించారు అధికారులు. ప్రమాదం టైమ్ లో రెండో ఫ్లోర్ లో మోటివేషనల్ స్పీచ్ ఈవెంట్ జరుగుతుందని తెలిపారు అధికారులు.  ఆ ప్రోగ్రామ్ కు చాలా మంది హాజరవడంతో సెకండ్ ఫ్లోర్ లో ఎక్కువ మరణాలు జరిగాయన్నారు. బయటకు వెళ్లేందుకు మెట్ల దారి ఒకటే ఉండటంతో.. ప్రజలు తప్పించుకోలేకపోయారన్నారు. గాయపడిన వారికి సంజయ్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. దీంతో హాస్పిటల్ దగ్గరికి భారీగా చేరుకున్నారు బాదితుల కుటుంబసభ్యులు. తమ వారి ఆచూకీ కోసం పలువురు కన్నీరుపెట్టుకున్నారు.ప్రమాద బాధితుల కోసం హాస్పిటల్ దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు సివిల్ డిఫెన్స్ ఆఫీసర్ ఎస్పీ తోమర్. గాయపడిన వారు, తప్పిపోయిన వారికి సాయం చేసేందకు డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

ఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన ప్రమాదంలో 27 మంది సజీవదహనమయ్యారు. మరో 12 మందికి గాయాలు కాగా.. మరో 50 మందిని కాపాడారు అధికారులు. పశ్చిమముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. నిన్న సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ప్రమాద సమాచారం అందినట్లు తెలిపారు ఢిల్లీ చీఫ్ ఫైర్ సర్వీస్ ఆఫీసర్ అతుల్ గార్గ్. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలుచేపట్టాయి. ముప్పైకి పైగా ఫైరింజన్లతో అతి కష్టం మీద మంటలార్పామన్నారు అధికారులు. ఫస్ట్ ఫ్లోర్ లోని సీసీటీవీ కెమెరాలు, రూటర్ తయారీ కంపెనీలు మంటలు చెలరేగాయని.. అక్కడి నుంచి భవనమంతా వ్యాపించినట్లు తెలిపారు. బిల్డింగ్ అంతా పొగ నిండిపోవడంతో.. అందులోని వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో.. మొదటి, రెండు అంతస్తుల్లోని అద్దాల కిటికీలు పగులగొట్టి పై నుంచి కిందకు దూకారు. మరికొందరు తాళ్ల సాయంతో కిందికి దిగారు. 

ఢిల్లీ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడినవారికి 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు ప్రధాని.