ట్రాన్స్ కో ప్రతిపాదనలకు అనుమతివ్వండి : డిప్యూటీ సీఎం భట్టి

ట్రాన్స్ కో ప్రతిపాదనలకు అనుమతివ్వండి : డిప్యూటీ సీఎం భట్టి
  • కేంద్ర మంత్రి మనోహర్​లాల్​ను కోరిన భట్టి

న్యూఢిల్లీ, వెలుగు: గ్రీన్ ఎనర్జీ కారిడార్ కింద తెలంగాణ ట్రాన్స్ కో ప్రతిపాదనలకు అనుమతి ఇవ్వాల‌‌‌‌ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్​ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. టీఈఎస్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌కో సంస్థ గ్రీన్ ఎనర్జీ కారిడార్ – ఫేజ్‌‌‌‌ 3 (జీఈసీ- III) కింద సమర్పించిన రాష్ట్రాంతర విద్యుత్ సప్లై వ్యవస్థ  ప్రతిపాదనలకు సంబంధించి అనుమతుల కోసం ఢిల్లీలో కేంద్ర మంత్రిని భట్టి విన్నవించారు. 

గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జీఈసీ-III) దశలో సౌర విద్యుత్ సంస్థ (ఎస్ఈసీఐ) మొదట తెలంగాణలోని 5 జిల్లాల్లో మొత్తం 13.5 గిగావాట్ల సామర్థ్యం గ్రీన్ పవర్ (ఆర్ఈ) జోన్‌‌‌‌ను గుర్తించింది. వీటి ద్వారా విండ్, సోలార్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌‌‌‌ను ఎగుమతి చేయాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. 

ఎస్ఈసీఐ, టీజీఆర్‌‌‌‌డీసీవోతో విస్తృతంగా చర్చించిన అనంతరం, భూ లభ్యతను పరిగణనలోకి తీసుకొని, ఈ ఆర్ఈ జోన్‌‌‌‌ల సామర్థ్యం 19 గిగావాట్లకు పెంచామని తెలిపారు. ఇది రాష్ట్రంలోని 8 జిల్లాలను కవర్ చేస్తున్నదన్నారు. ఈ సవరణకు అనుగుణంగా, టీజీ ట్రాన్స్‌‌‌‌కో మొత్తం 19 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన 8 ట్రాన్స్‌‌‌‌మిషన్ పథకాలతో కూడిన సమగ్ర ప్రతిపాదనను తయారు చేసి, దాని అంచనా వ్యయం రూ.6,895 కోట్లుగా పేర్కొంటూ కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ)కు అందజేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో టీజీ ట్రాన్స్‌‌‌‌కో సంస్థ సమర్పించిన ఈ 8 పథకాల (జిల్లాల) ద్వారా 19 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యానికి సంబంధించిన ప్రతిపాదనను వీలైనంత త్వరగా ఆమోదించాల‌‌‌‌ని కోరారు.