ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ..రాజకీయాలకతీతంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ..రాజకీయాలకతీతంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  • మహిళల కోసం ఇందిరాక్రాంతి స్కీమ్‌‌ కింద వడ్డీ లేని రుణాలు
  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

మధిర/ముదిగొండ, వెలుగు : రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, ఇండ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇప్పుడు ఇల్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందొద్దని, అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర పట్టణం, ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురంలో జరిగిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇల్లు లేకుండా ఏ ఒక్కరూ ఉండకూడదన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రూ. 22,500 కోట్లు ఖర్చు చేసి 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని చెప్పారు. బీఆర్‌‌ఎస్‌‌ పదేండ్ల పాలనలో పేదల అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని, ఏనాడు ప్రజల అవసరాలను తీర్చలేదని విమర్శించారు. గత పాలకులు రూ. లక్షల కోట్లు అప్పు చేసి ప్రజల సొమ్మును దోపిడీ చేశారని ఆరోపించారు. 

కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చాక ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే జీర్ణించుకోలేని బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల అవసరాలే ప్రభుత్వ ఎజెండా అని, రాష్ట్రంలో 1.12 కోట్ల కుటుంబాలు ఉంటే.. ఇందులో 93 లక్షల కుటుంబాలకు రేషన్‌‌ కార్డులు ఇచ్చామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 56 వేల ఉద్యోగాలు అందించామని చెప్పారు. 

ఇందిరాక్రాంతి పథకం కింద డ్వాక్రా మహిళలకు రూ. లక్ష కోట్లతో రుణాలు ఇచ్చేందుకు ప్లాన్‌‌ చేస్తున్నామన్నారు. సోలార్‌‌ విద్యుత్‌‌ కోసం రూ. 12,500 కోట్లను కేటాయించామని, సోలార్‌‌ పంప్‌‌సెట్లతో పాటు డ్రిప్‌‌ సైతం అందజేస్తామని ఇందుకోసం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు.  కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తోందని చెప్పారు.

 ప్రజలు వేసిన ప్రతి ఓటుకు విలువ తీసుకొస్తానని, తలెత్తుకుని తిరిగేలా గౌరవం తీసుకు వస్తానని చెప్పారు. అంతకుముందు మధిర ట్యాంక్‌‌ బండ్‌‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మధిరలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర దురిశెట్టి అనుదీప్‌‌, రాయల నాగేశ్వరరావు, బండారు నరసింహారావు, కాంగ్రెస్‌‌ మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిశోర్‌‌ పాల్గొన్నారు.