
- దేవన్నపేట పంప్ హౌజ్ లో రెండు మోటార్ల వర్క్స్ పూర్తి
- మూడో పంపు ఎన్-కేసింగ్, ఎలక్ట్రికల్ పనులు షురూ
- త్వరలోనే అందుబాటులోకి మూడో మోటార్
హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు: దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వచ్చే డిసెంబర్ లోగా పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు టార్గె ట్ గా పెట్టుకుని, 5.57 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రాజెక్టు ఫేజ్–3 లో కీలకమైన దేవన్నపేట పంప్ హౌజ్ వద్ద పెండింగ్ పనులను ముందుగా కంప్లీట్ చేయనుంది.
ఇప్పటికే రెండు మోటార్ల ట్రయల్ రన్ నిర్వహించింది. త్వరలోనే మూడో పంపును కూడా ఆన్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు 10 రోజులుగా దేవన్నపేట పంప్ హౌజ్ వద్ద ఆస్ట్రియాకు చెందిన ఆండ్రిట్జ్ కంపెనీ ఇంజినీర్లు పనులు చేస్తున్నారు.
దేవన్నపేట పంప్ హౌజే కీలకం
ఉమ్మడి వరంగల్ జిల్లా (ప్రస్తుతం ములుగు) కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరిపై 2004లో జువ్వాడి చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం రూ.6,016 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైంది. గోదావరి నుంచి 38.5 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి 5.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీటిని అందించడం లక్ష్యంగా దీన్ని చేపట్టారు. కాగా.. ప్రాజెక్ట్ ఫస్ట్, సెకండ్ ఫేజ్ లో భాగంగా అప్పటి కాంగ్రెస్ సర్కార్.. నర్సింగాపూర్, ధర్మసాగర్, ఆర్ఎస్ ఘన్ పూర్, అశ్వరావుపల్లి, గండిరామారం, బొమ్మకూరు, వెల్దండ, తపాస్ పల్లి వద్ద రిజర్వాయర్లను నిర్మించింది. ప్రాజెక్ట్ లో థర్డ్ ఫేజ్ కీలకం కాగా.. రామప్ప నుంచి హసన్ పర్తి మండలం దేవన్నపేట పంప్ హౌజ్ వరకు రూ.1,410 కోట్లతో 49.06 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణ పనులు చేపట్టింది.
2011, జులైలో హనుమకొండ జిల్లా శాయంపేట మండలం చలివాగు ప్రాజెక్టు వద్ద బుంగపడడంతో ముగ్గురు కార్మికులు చనిపోగా పనులకు బ్రేక్ పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చేసింది. పదేండ్లపాటు పనులను పెండింగ్ లో పెట్టింది. కానీ, అప్పటికే ఫస్ట్, సెకండ్ ఫేజ్ లతో పాటు థర్డ్ ఫేజ్ లో పూర్తయిన పనులతో మొత్తంగా 3.16 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ పెండింగ్ పనులపై దృష్టి పెట్టింది. వచ్చే డిసెంబర్ లోగా మిగతా పనులు పూర్తి చేసి మరో 2.41 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటోంది.
రూ.వెయ్యి కోట్లు మంజూరు
దేవాదుల ఎత్తిపోతల పనులు సకాలంలో పూర్తి కాక ఏటేటా బడ్జెట్ అంచనాలు పెరుగుతూ పోయాయి. బీఆర్ఎస్ హయాంలో 2016 –-17లో రూ.13,445 కోట్లు, 2022లో రూ.17,500 కోట్లకు పెంచారు. కానీ సకాలంలో నిధులు ఇవ్వకపోగా పనులు ముందుకు సాగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ పనులు పూర్తి చేసేందుకు రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కోరింది.
దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.17,500 కోట్ల నుంచి రూ.18,500 కోట్లకు పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో రూ.14,188 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఇంకో రూ.4,312 కోట్ల దాకా నిధులు కేటాయిస్తే పనులు కంప్లీట్ అవుతుండడంతో గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,001 కోట్లు మంజూరు చేసింది.
మూడో మోటార్ పనులు షురూ..
థర్డ్ ఫేజ్ పంప్ హౌజ్ లోని మూడు మోటార్లలో రెండింటిని గత మార్చి18న మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ఆన్ చేయగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ తలెత్తాయి. అదే నెల 27న వచ్చి మరోసారి రెండు మోటార్లు ఆన్ చేశారు. అనంతరం ధర్మసాగర్ వద్ద 208 మీటర్ల మేర నిర్మించిన మినీ టన్నెల్ లీకైంది. దీంతో పనులను చాలెంజ్ గా తీసుకుని గత మే 3న మరోసారి ధర్మసాగర్, దేవన్నపేట పంప్ హౌజ్ ను మంత్రులు విజిట్ చేశారు.
పెండింగ్ వర్క్స్ అన్నీ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొద్దిరోజుల కింద టన్నెల్ లీకేజీ పనులు కంప్లీట్ అయ్యాయి. కాగా.. మళ్లీ ఫస్ట్ మోటార్ పంపింగ్ లో సమస్యలు తలెత్తగా మరమ్మతు చేసి ఐదు రోజుల కింద ట్రయల్ రన్ వేసి.. దాదాపు 4 గంటల పాటు సక్సెస్ ఫుల్ గా పంపింగ్ చేశారు. ఇటీవల మూడో మోటార్ పైపు ఎన్ కేసింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్ స్టార్ట్ చేశారు. వీటి పనులు రెండు నెలలపాటు జరిగే చాన్స్ ఉందని దేవాదుల ప్రాజెక్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. వచ్చే డిసెంబర్ లోగా పనులను పూర్తి చేస్తామని తెలిపారు.
గడువులోగా పనులు పూర్తి చేస్తాం
దేవాదుల థర్డ్ ఫేజ్ పనుల కోసం ప్రభుత్వం మరో వెయ్యి కోట్లు కేటాయించింది. ఇప్పటికే దేవన్నపేట పంప్ హౌజ్ లో మూడో మోటార్ కేసింగ్ పనులు చేపట్టాం. అవి పూర్తికాగానే మూడో మోటార్ కూడా అందుబాటులోకి వస్తుంది. గడువులోగా పనులను పూర్తి చేస్తాం. - రాంప్రసాద్, ఎస్ఈ, దేవాదుల