దేవరకొండ, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. గురువారం ముదిగొండ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో రూ.2 కోట్లతో తరగతి గదులు, రూ.80 లక్షలతో బోధన సిబ్బంది ప్రత్యేక గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పేద విద్యార్థులు చదువుల్లో రాణించేలా అనుకూల వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.
నియోజకవర్గంలోని 149 గ్రామాల్లో రూ.14.90 కోట్లతో వీవో బిల్డింగులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఎమ్మెల్యే నివాసం వద్ద రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేశారు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం దేవరకొండ పట్టణంలోని చిన్న దర్గా వద్ద హజరత్ సయ్యద్ సులేమాన్ షాహ్ కద్రీ గంధం ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
