
మానవులకు కష్టం వచ్చిందంటే... స్వామీ.. నన్ను కష్టాలనుంచి గట్టెంక్కించు అని భగవంతుడిని ప్రార్థిస్తారు. మరికొందరు కోరికల చిట్టాతో దైవాన్ని ప్రార్థిస్తారు. అలాంటప్పుడు ఆ చిట్టా పెరుగుతుందే తప్ప...దైవబలం పెరగదని పండితులు చెబుతున్నారు. అసలు దైవాన్ని దేనికోసం ప్రార్ధించాలి? భగవంతుడిని ఎలావేడుకోవాలి.. పురాణాల్లో ఏముంది.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
పురాణాలు.. చరిత్ర ఆధారంగా ఎందరో చక్రవర్తులు ఈ భూమిని పాలించారు. సుదీర్ఘకాలంపాటు పాలన చేసి.. శత్రువులపై ఎన్నో విజయాలు సాధించారు. .. అంతేకాదు ఎన్నో సుఖాలు అనుభవించి.. ఎన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలను నిర్మించారు. ఇంత చేసిన మహారాజులు ఏ ఒక్కరూ కూడా పొందవలసినది అంతా పొందానని.. ఇక జీవితంలో అనుభవించాల్సింది ఏమీ లేదని అని తృప్తితో మరణించిన దాఖలాలు చరిత్రలో కాని.. పురాణాల్లో కాని ఎక్కడ లేదు.
దేవతల నుంచి దివ్యాస్త్రాలను పొందిన మహావీరుల గురించి మన ఇతిహాసాల్లో ఉంది. వీరు బాహ్య శత్రువులను జయించారే తప్ప, అంతఃశ్శత్రువులను గెలవలేకపోయారు . ఆ మహావీరులెవ్వరూ మానసికంగా ఉన్నత స్థితిని చేరేందుకు దైవాన్ని ప్రార్థించలేదు. వారి తపస్సులో కేవలం విజయకాంక్ష తప్ప మరొకటి లేదు. దైవ శక్తిచే పొందిన దివ్యాస్త్రాలూ కూడా ఒక్కో సమయంలో పనిచేయలేదని పురాణాల ద్వారా తెలుస్తుంది.
రావణాశురుని అనుచరులు ప్రయోగించిన గొప్ప అస్త్రాలే హనుమంతుడిని ఏమీ చేయలేకపోయాయని రామాయణం చెబుతోంది. అలాగే అర్జునుడు వరాలకోసం శ్రీకృష్ణుడిని ఆశ్రయించలేదు. అందుకే దివ్యజ్ఞానామృతాన్ని పొందగలిగాడు భగవద్గీత ద్వారా తెలుస్తుంది. ఆంజనేయుడు కాని.. అర్జునుడి కాని కోరికల చిట్టాతో దైవాన్ని ప్రార్థించలేదు.అందుకే వారికి దైవబలం పెరిగిందని రుషులు చెబుతున్నారు.
ప్రస్తుతం మానవుడు దేనివల్ల ఆనందాన్ని, శాంతిని, సంతృప్తిని పొందుతామో తెలియక... మనిషి ఇంద్రియాల చేతిలో మోసపోతున్నాడు. వేటగాడు జింకను వేటాడినట్లే... కోరికలు మనిషిని వేటాడుతున్నాయి. కల్పవృక్షం ప్రసాదించే భోగాలూ క్షణికానందాన్నే ఇస్తాయి. మనిషి ఎన్ని తీర్థాలను, దేవతలను సేవించినా, విషయవాంఛల నుంచి బయటపడనిదే- ప్రయోజనం ఉండదని పురాణాలు చెబుతున్నాయి.
ఇతిహాస గ్రంథాల ప్రకారం మానవశరీరాన్ని .. విషయవాంఛలు అనే శత్రుసేన ఆక్రమించింది. ఇంద్రియాలతో పొందే అనుభూతులే వాటి గజబలగం. కామ క్రోధాదులే వాటి ఆయుధాలు. అహంకారమే వాటికి సేనాపతి... ఇంద్రియాలు వాటి పతాకం... దేహమనే రాజ్యంలో అంతరంగమనే రాజప్రాకారాన్ని ఇవి చుట్టుముట్టాయి.
►ALSO READ | health alert: విటమిన్ D లోపం..కనిపించే లక్షణాలు.. దుష్పలితాలు.. నివారణ మార్గాలు
ఇక బుద్ధి అనే మంత్రిని చీకటి గదిలో బంధించి.. . మనసు అనే రాజును బానిసను చేశాయి. దీని ప్రకారంగా ఎంతటి పరాక్రమశాలి అయినా బాహ్యంగా కనపడే శత్రువులతో తలపడగలడు కాని... కంటికి కనపడకుండా తనలోనే తిష్ఠవేసిన ప్రత్యర్థులతో పోరాడలేడు. ఇంద్రియ నిగ్రహం, బుద్ధి వికాసంతోనే దైవ శక్తి సాధ్యమవుతుంది. మనసస్సను నిగ్రహం చేసుకొని దైవ శక్తి సాధిస్తే ఎన్ని ఆయుధాలు దాడి చేసినా దేహాన్ని ఏమీ చేయలేవు.
పెద్దలు.. ఇంద్రియాలను అరణ్యంతో పోల్చారు . అడవిని సులభంగా దాటాలంటే దాని గురించి తెలియాలి. అలాగే ఇంద్రియాల కిటుకు తెలిస్తే, ఇంద్రియారణ్యాన్ని సులభంగా దాటగలం. ఇంద్రియాలు మనసును ఎలా మాయచేస్తాయో, మనిషి సూక్ష్మదృష్టితో గమనించాలి.
చర్మ సౌందర్యంతో మనసును మోహింపజేసే కళ్లు... వాటి వెనకనున్న రక్తమాంసాలను కప్పిపుచ్చుతుంది. సుగంధాలను అందించే ముక్కు... దుర్గంధమైన దేహంలోనే తాను కూడా ఉన్నాననే విషయాన్ని మరచేలా చేస్తుంది. రుచులను ఆస్వాదించేందుకు ఉపయోగించే నాలుక.. వాటి చాటున ఉన్న రోగాలను దాచిపెడుతుంది. ఇక చెవులు మనిషిని అనఏక రకాల మాటలతో మభ్యపెడుతుంది. ఇలా అన్ని ఇంద్రియాలూ మనిషిని తప్పుదోవ పట్టిస్తాయి.
మనిషిలోనే ఉంటూ, మనిషిని నడిపించే ఈ ఇంద్రియాలను మనసు స్వాధీనపరచుకోవాలి. వినటం, చూడటం, స్పృశించటం, గ్రహించటం... ఇలా మనం చేసే అన్ని పనులూ ఇంద్రియ కార్యకలాపాలే. ప్రతి ఇంద్రియానికీ దైవ ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి అనే రెండు స్వభావాలు ఉంటాయి.
సత్కర్మలు, సత్ప్రవర్తన, సత్ సాంగత్యం- ఇంద్రియాల్లో దైవప్రవృత్తిని నింపుతాయి. అవి ఇంద్రియారణ్యం నుంచి బయటపడే మార్గం చూపిస్తాయి. బుద్ధి వికాసానికి తోడ్పడతాయి. మనసును ఇంద్రియాలకు దూరంపెట్టి, బుద్ధికి చేరువ చేయాలి. అప్పుడే అంతరంగంలో తిష్ఠవేసిన విషయవాంఛలనే శత్రువులను జయించగలం. మనసు కి.. బుద్ధి హితబోధ చేస్తే- ఆనందం శాంతి సంతృప్తి ఎక్కడ లభిస్తాయో మనిషి గ్రహించగలడని పురాణాల ద్వారా తెలుస్తుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న ఈ అనుమానాల నివృత్తికి ఆధ్యాత్మిక పండితులను సంప్రదించటం ఉత్తమం.