క్రికెటర్లకు ఫిట్​నెస్​ టెస్ట్​ మస్ట్​

క్రికెటర్లకు ఫిట్​నెస్​ టెస్ట్​ మస్ట్​
  • కొత్తగా డెక్సా పరీక్షను ప్రవేశపెట్టాలని నిర్ణయం​
  • ప్లేయర్ల ఫిట్​నెస్, వర్క్‌‌‌‌లోడ్‌‌పై బీసీసీఐ ఫోకస్‌‌
  • రోహిత్‌‌ కెప్టెన్సీకి ముప్పు లేనట్టే

మెగా టోర్నీల్లో వరుస ఫెయిల్యూర్స్​.. ప్రధాన ప్లేయర్ల గాయాలు.. యంగ్​స్టర్స్​లో లోపిస్తున్న ఫిట్​నెస్​ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ  కీలక నిర్ణయం తీసుకుంది. ప్లేయర్ల సెలెక్షన్​కు గతంలో ఉన్న ‘యో‑యో’ ఫిట్​నెస్​టెస్ట్​తో పాటు డెక్సా పరీక్షను తప్పనిసరి చేసింది. దీంతో గాయాల​తో టీమ్​కు దూరమైన ప్లేయర్లు, నేషనల్​ టీమ్​లో బెర్త్​ ఆశించే  ప్రతీ క్రికెటర్​ ఇకపై​ ఈ రెండు టెస్టులు  పాస్​ కావాల్సిందే. 

న్యూఢిల్లీ: ఈ ఏడాది సొంతగడ్డపై జరిగే వన్డే వరల్డ్​కప్​  కోసం బీసీసీఐ పక్కా రోడ్​ మ్యాప్​ రెడీ చేస్తోంది. ఈ టోర్నీని దృష్టిలో పెట్టుకుని క్రికెటర్ల ఫిట్​నెస్​పై మరింత ఫోకస్​ పెంచింది. నేషనల్​ టీమ్​ ప్లేయర్ల కోసం ‘యో‑– యో’ టెస్ట్​ను మళ్లీ తీసుకొచ్చింది. దీంతో పాటు కొత్తగా ‘డెక్సా టెస్ట్’​ (బోన్​ స్కాన్​ టెస్ట్)ను కూడా తప్పనిసరి చేసింది. ప్లేయర్ల సెలెక్షన్​లో ఈ రెండింటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆదివారం ముంబైలో జరిగిన హై ప్రొఫైల్​ రివ్యూ మీటింగ్​లో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. బీసీసీఐ ప్రెసిడెంట్​ రోజర్​ బిన్నీ, సెక్రటరీ జై షా, కెప్టెన్​ రోహిత్​ శర్మ, కోచ్​ రాహుల్​ ద్రవిడ్​, ఎన్​సీఏ చీఫ్​ వీవీఎస్​ లక్ష్మణ్​, చీఫ్​ సెలెక్టర్​ చేతన్​ శర్మ ఈ మీటింగ్​కు హాజరయ్యారు. ‘టీమ్​ ఎంపికలో యో యో, డెక్సా టెస్ట్​లను పరిగణనలోకి తీసుకుంటాం. సెంట్రల్​ పూల్​ ప్లేయర్లకు ప్రత్యేకమైన రోడ్​ మ్యాప్​ను అమలు చేస్తాం’ అని బీసీసీఐ పేర్కొంది. 

యంగ్​స్టర్స్​ డొమెస్టిక్​ ఆడేలా..

ప్లేయర్ల అందుబాటు, వర్క్​లోడ్​ మేనేజ్​మెంట్, ఫిట్​నెస్​తో పాటు వన్డే వరల్డ్​కప్​ రోడ్​ మ్యాప్​​పై ఈ మీటింగ్​లో ఎక్కువగా చర్చ జరిగింది. నేషనల్​ టీమ్​కు ఎంపిక కావాలనుకునే ఎమర్జింగ్​ ప్లేయర్లు వీలైనంత ఎక్కువగా డొమెస్టిక్​ సీజన్​లో పాల్గొనాలని నిర్ణయించారు. ఈసారి ఐపీఎల్​లో పాల్గొనే ప్రధాన ప్లేయర్లపై ఎన్​సీఏ ఎక్కువగా ఫోకస్​ చేయనుంది. ఎఫ్​టీపీని దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు ఆయా ఫ్రాంచైజీలతో కలిసి పని చేయాలని డిసైడ్​ చేశారు. గాయాల కారణంగా దీపక్​ చహర్​, బుమ్రా వంటి ప్లేయర్లు రెగ్యులర్​గా టీమ్​కు దూరం కావడంపై బీసీసీఐ ఆందోళన చెందుతోంది. దీంతో ఫిట్​నెస్​కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. 

వరల్డ్​ కప్​ కోసం 20 మందితో షార్ట్​లిస్ట్​

అక్టోబర్​–నవంబర్​లో జరిగే వన్డే వరల్డ్ కప్​​ కోసం బీసీసీఐ ఇప్పట్నించే ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా మెగా టోర్నీ కోసం 20 మంది ప్లేయర్లతో షార్ట్​ లిస్ట్​ను రూపొందించింది. వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్​ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్​, వన్డే వరల్డ్​కప్​ను దృష్టిలో పెట్టుకుని ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ఈ 20 మందిని మెగా టోర్నీ వరకు రొటేట్​ చేయనున్నారు.  

రోహిత్​, ద్రవిడ్​ కొనసాగింపు 

టీ20 కొత్త కెప్టెన్​ హార్దిక్​ పాండ్యా ఈ మీటింగ్​కు హాజరుకాలేదు. ​మంగళవారం నుంచి శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్​ కోసం పాండ్యా రెడీ అవుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోహిత్​ శర్మ కెప్టెన్సీకి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. టెస్ట్​, వన్డేలకు అతడినే కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోంది. అలాగే, కోచ్​గా ద్రవిడ్​పని తీరుపైనా బోర్డు సంతృప్తి వ్యక్తం చేసినట్టు  తెలుస్తోంది. ఇక,  చేతన్​ శర్మ ఈ మీటింగ్​కు హాజరుకావడంతో.. మరోసారి అతన్నే సెలెక్షన్​ కమిటీ చైర్మన్​గా కొనసాగింవచ్చని సమాచారం. ఒకవేళ చైర్మన్​గా కాకపోయిన నార్త్​జోన్​ నుంచి సెలెక్టర్​గా కొనసాగించొచ్చు. క్రికెట్​ అడ్వైజరీ కమిటీ త్వరలోనే  కొత్త సెలెక్షన్​ కమిటీని ఎంపిక చేయనుంది.