
మెదక్/నర్సాపూర్/తూప్రాన్, వెలుగు: జిల్లాలో మరో రెండు చోట్ల డయాలసిస్ సేవలు అందుబాటులోకి రావడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇబ్బందులు తప్పాయి. గతంలో మెదక్ పట్టణంలో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రమే డయాలసిస్ సౌకర్యం అందుబాటులో ఉండేది. అక్కడ బెడ్స్‌ను 5 నుంచి 10కి పెంచినప్పటికీ రోగుల సంఖ్య పెరగడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. దీంతో నర్సాపూర్, తూప్రాన్ ప్రాంతాల వారు డయాలసిస్ కోసం సంగారెడ్డి, హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది.
మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక్కసారి డయాలసిస్ చేస్తే రూ.2,500 ఖర్చు అయ్యేది. ఇది పేదలకు మరింత భారంగా మారింది. ఈ క్రమంలో నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారు. గత నవంబర్ లో 5 బెడ్స్ తో డయాలసిస్ విభాగం సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో నర్సాపూర్, శివ్వంపేట, హత్నూర, చిలప్ చెడు, కౌడిపల్లి మండలాల పరిధిలోని 100 మందికి పైగా డయాలసిస్ రోగులకు ఎంతో మేలు జరుగుతోంది. ఇక్కడ ప్రతి రోజు రెండు షిఫ్టుల్లో 18 మందికి డయాలసిస్ చేస్తుండగా గడిచిన 8 నెలల్లో 1,278 మంది డయాలసిస్ సేవలు పొందారు.
రోజు 8 నుంచి 10 మంది
తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో సైతం డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. మంత్రి దామోదర గత ఏప్రిల్ 5న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. మొత్తం 5 బెడ్లను కేటాయించారు. రోజు 8 నుంచి 10 మంది పేషెంట్లకు డయాలసిస్ నిర్వహిస్తారు. మొత్తం 40 మంది డయాలసిస్ పేషెంట్లు చికిత్స కోసం పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు.
ఇబ్బందులు తప్పాయి
గతంలో డయాలసిస్ కోసం సంగారెడ్డి లేదా హైదరాబాద్ వెళ్లేవాడిని. నర్సాపూర్ ఆస్పత్రిలో డయాలసిస్ ఏర్పాటు వల్ల సమయం, డబ్బు ఆదా అవుతున్నాయి. మాలాంటి వారికి ఇబ్బందులు తప్పాయి.
సత్తయ్య, జక్కపల్లి, డయాలసిస్ పేషెంట్
మరో సెషన్ కు అవకాశం
నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోజు రెండు సెషన్లు డయాలసిస్ నిర్వహిస్తుండగా మరో సెషన్‌కు అవకాశం ఉంది. ప్రతి నెలా సుమారు 200 మంది డయాలసిస్ సేవలు పొందుతున్నారు. కొత్తగా 19 మంది డయాలసిస్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. హైదరాబాద్ వెళ్లి డయాలసిస్ చేసుకోవడం వల్ల రోగులపై ఆర్థిక భారం పడేది. నర్సాపూర్ హాస్పిటల్ లో డయాలసిస్ ఏర్పాటు వల్ల దూర భారం తగ్గడంతో పాటు ఆర్థిక భారం తగ్గి డబ్బులు ఆదా అవుతున్నాయి.
డాక్టర్ పావని, సూపరింటెండెంట్, నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి