
భారతదేశంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి సంబంధించిన రూ. 13వేల కోట్ల భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ తమ్ముడు నేహాల్ మోడీని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) & సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నుండి వచ్చిన అభ్యర్థన మేరకు నిన్న శుక్రవారం అంటే జూలై 4న నేహాల్ మోడీని అదుపులోకి తీసుకున్నట్లు భారత అధికారులకు సమాచారం తెలిపారు.
ఈ కేసు విచారణ జూలై 17న జరగనుంది. అయితే అదే రోజు నేహాల్ బెయిల్ కోరవచ్చని తెలుస్తోంది, అలాగే అమెరికా ప్రాసిక్యూటర్లు దీనిని వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) 2002 సెక్షన్ 3 కింద మనీలాండరింగ్ ఆరోపణలు, నేరపూరిత కుట్ర, సాక్ష్యాలను దొరక్కుండా చేయడం వంటి అభియోగాలపై నేహాల్‌ను భారత్ అప్పగించాలని కోరుతోంది.
46 ఏళ్ల నేహాల్ మోడీ తన సోదరుడు నీరవ్ మోడీ, మామ మెహుల్ చోక్సీతో కలిసి పీఎన్‌బీ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బెల్జియంలో పుట్టి పెరిగిన నేహాల్‌కు ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ భాషలు బాగా వచ్చు. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో నేహాల్ పేరు కూడా ఉంది. నీరవ్ మోడీ తరపున అక్రమంగా సంపాదించిన డబ్బును దాచిపెట్టడానికి, మరొక చోటుకి మార్చడానికి షెల్ కంపెనీలు, విదేశీ లావాదేవీలు వాడినట్లు అధికారులు తెలిపారు.
పీఎన్‌బీ అక్రమాలు బయటపడిన తర్వాత నీరవ్ మోడీ సన్నిహితుడు, ఎగ్జిక్యూటివ్ మిహిర్ ఆర్ భన్సాలీతో కలిసి నేహాల్ మోడీ, దుబాయ్ నుండి 50 కిలోల బంగారం, పెద్ద మొత్తంలో నగదును తీసుకుని వెళ్లినట్లు ఇంకా డమ్మీ డైరెక్టర్లను బెదిరించి వాళ్ళ పేర్లు చెప్పవద్దని ఆదేశించినట్లు ఈడీ ఆరోపించింది. ప్రస్తుతం నీరవ్ మోడీ యూకేలోని లండన్ జైలులో ఉన్నారు, అయితే భారత్‌కు అప్పగించే ప్రక్రియ కొనసాగుతుంది.