- రూ.27.28 లక్షల కోట్ల విలువైన2,070 కోట్ల లావాదేవీలు
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ట్రాన్సాక్షన్లు కిందటి నెలలో రికార్డు స్థాయికి చేరాయి. మొత్తం 2,070 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. వీటి విలువ రూ.27.28 లక్షల కోట్లుగా నమోదైంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) విడుదల చేసిన డేటా ప్రకారం, అక్టోబర్ నెలలో యూపీఐ హిస్టరీలోనే అత్యధిక నెలవారి ట్రాన్సాక్షన్లు జరిగాయి.
ట్రాన్సాక్షన్ల సంఖ్య, విలువ.. రెండింటి పరంగా కొత్త రికార్డ్‌లు క్రియేట్ అయ్యాయి. పండుగ టైమ్‌లో వినియోగం పెరగడం, జీఎస్‌టీ 2.0 వలన చిన్న వ్యాపారాల్లో లిక్విడిటీ మెరుగవడంతో యూపీఐ ట్రాన్సాక్షన్లు పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1,980 కోట్ల ట్రాన్సాక్షన్లు జరగగా, వీటి విలువ రూ.25.7 లక్షల కోట్లుగా రికార్డయ్యింది.
రిటైల్, ఈ–కామర్స్ రంగాల్లో పండుగ ఖర్చులు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో యూపీఐ వినియోగం పెరగడం ఈ వృద్ధికి దోహదం చేశాయని ఫిన్‌టెక్ సెక్టార్‌లోని నిపుణులు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా కూడా యూపీఐ వినియోగం పెరిగిందని, యూపీఐ లైట్, క్రెడిట్ కార్డులను యూపీఐతో లింక్ చేసుకోవడం కూడా ఈ గ్రోత్‌కు కారణమని అన్నారు.
వివాహాలు, ప్రయాణల సీజన్, డిజిటల్ పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో కొత్త ఆవిష్కరణలతో యూపీఐ వాడకం మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, లావాదేవీల భద్రత, నెట్‌వర్క్ సామర్థ్యం మెరుగుపరచడం కీలకమని హెచ్చరించారు.
