
- సుప్రీం కోర్టులో బెంగాల్ వాదనలు
- బిల్లులు తొక్కిపెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధం
- ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ పై సుప్రీం కోర్టులో విచారణ
న్యూఢిల్లీ: బిల్లుల రూపంలో ఉన్న ప్రజల సంకల్పం అనేది.. రాష్ట్రపతి, గవర్నర్ల ఇష్టా అయిష్టాలకు లోబడి ఉండొద్దని సుప్రీం కోర్టుకు బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలకు సంబంధించి సుప్రీం కోర్టులో బుధవారం జరిగిన విచారణలో బెంగాల్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది.
సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీఎస్ నర్సింహా, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ ధర్మాసనం ముందు బెంగాల్ సర్కార్ తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు లేదా రాష్ట్రపతి ఎంతకాలం వరకు నిర్ణయం తీసుకోవాలనే విషయంలో సుప్రీం కోర్టు టైమ్‌లైన్ నిర్దేశించవచ్చా? అనే అంశంపై చర్చ జరిగింది.
‘‘బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్లు తొక్కిపెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. లెజిస్లేటివ్ ప్రక్రియలో రాష్ట్రపతి, గవర్నర్ల జోక్యం ఉండొద్దు. బిల్లు రాజ్యాంగబద్ధతను పరిశీలించే అధికారం గవర్నర్‌కు లేదు. బిల్లు ఆమోదం పొందాక దాని రాజ్యాంగబద్ధతను కోర్టులు పరిశీలిస్తాయి. అసెంబ్లీల సార్వభౌమత్వం అనేది.. పార్లమెంట్‌తో సమానం. ఆర్టికల్ 200 ప్రకారం.. గవర్నర్ వద్దకు ఏదైనా బిల్లు వస్తే వెంటనే దానిపై ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి’’ అని సిబల్ వాదించారు.
‘‘బిల్లులు అసెంబ్లీ పరిధికి అనుగుణంగా లేకపోయినా.. వాటి చెల్లుబాటును కోర్టులు పరీక్షించవచ్చనే మీరు అంటున్నారా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి కపిల్ సిబల్ స్పందిస్తూ.. సార్వభౌమాధికారం అనేది కార్యనిర్వాహకానికి అడ్డంకిగా ఉండొద్దని, ఒక చట్టం తీసుకొస్తే దాని రాజ్యాంగబద్ధతను కోర్టులే చూడాలని, కార్యనిర్వాహకులు (రాష్ట్రపతి, గవర్నర్లు) కాదని చెప్పారు.
ఒకసారి చట్టసభల్లో బిల్లు ఆమోదం పొందితే.. రాజ్యాంగబద్ధత ఉందనే భావనే ఏర్పడుతుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను ఈ నెల 9 వ తేదీకి వాయిదా వేసింది.