
- అభినందించిన మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్(డీఎంఈ) డైరెక్టర్ డాక్టర్ ఎ. నరేంద్ర కుమార్‌కు పీడియాట్రిక్ థొరాసిక్ సర్జరీ రంగంలో నేషనల్ అవార్డు లభించింది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జన్స్ (ఐఏపీఎస్)లోని సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ థొరాసిక్ సర్జరీ (ఎస్పీటీఎస్) అందించే ప్రతిష్టాత్మక ఒరేషన్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. శనివారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ నరేంద్ర కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. దేశంలో పీడియాట్రిక్ థొరాసిక్ సర్జరీ విభాగాన్ని ఆయనే మొదలుపెట్టారు.
నరేంద్ర కుమార్ మార్గదర్శకత్వంతో ఈ రంగంలో దేశవ్యాప్తంగా అనేక మంది నిపుణులు తయారయ్యారని ఎస్పీటీఎస్ ప్రశంసించింది. గత 25 ఏండ్లుగా అత్యంత సూక్ష్మమైన శస్త్రచికిత్సల ద్వారా లక్షలాది చిన్నారుల ప్రాణాలను నరేంద్ర కాపాడారని వివరించింది. ఈ అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్ర కుమార్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు.