
- ఔరంగాబాద్ జిల్లా కుద్వ పోలీసు స్టేషన్ పరిధిలో కేసు
- వింత కేసును 6నెలలపాటు విచారించి పోలీసులేం తేల్చారంటే..
పాట్నా: ఔరంగాబాద్ జిల్లా కుద్వ పోలీసు స్టేషన్ పరిధిలో గత జనవరి నెలలో కలకలం రేగింది. ఓ మహిళ వింత ఫిర్యాదుతో స్టేషన్ కు వచ్చి బైఠాయించడమే కారణం. ఇంతకూ ఆమె ఫిర్యాదు ఏమిటంటే.. తనకు రాత్రిపూట కలలో ఓ మాంత్రికుడొచ్చి తరచూ అత్యాచారం చేస్తున్నాడని.. తనను కాపాడాలంటూ వేడుకుంటోంది. కలలో అత్యాచారం మేమేం చేయలేం... మానసిక వైద్యులతో చూపించుకోమంటే.. ఆమె లేదు లేదంటూ విలపించింది. సదరు మహిళ చూస్తుంటే కట్టుబొట్టు అన్నీ బాగున్నాయి. చూస్తుంటే పిచ్చిదానిలా మాత్రం లేదు. అయితే ఆమె చెబుతున్న మాటలు.. కంటతడిపెట్టుకుని వివరిస్తుంటే ఏం చేయాలో పోలీసులకు అంతుబట్టలేదు. అయితే ఆమె బాధ పడుతున్న తీరు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. కేసు తీసుకోకపోతే స్టేషన్ నుంచి వెళ్లేది లేదనే రీతిలో ఆమె అక్కడే మకాం వేయడంతో పోలీసులు ఎట్టకేలకు ఫిర్యాదు తీసుకుని ఆమెను పంపించారు. ఎఫ్.ఐ.ఆర్ జారీ చేయాలో లేదోనని తర్జన భర్జనలుపడుతుంటే.. బాధిత మహిళ స్టేషన్ కు వచ్చి వెళ్లడం అందరూ చూశారు.. ఒకవేళ ఆమెకు జరగరానిదేదైనా అయితే ఎలా.. అంటూ కేసు నమోదు చేశాడు. ఇన్వెస్టిగేషన్ కు పురమాయించారు.
విచారణలో బాధితురాలి పూర్వ పరాలన్నీ ఆరా తీశారు. ఔరంగాబాద్ జిల్లా కుద్వ పోలీసు స్టేషన్ పరిధిలోని గాంధీ మైదాన్ ప్రాంతంలో బాధితురాలు నివసిస్తోంది. ఇంటికి వెళ్లి ఆమెతోపాటు ఇరుగు పొరుగును విచారించారు. తన కుమారుడికి ఆరోగ్యం బాగోలేకపోతే.. ప్రశాంత్ చతుర్వేది అనే మాంత్రికుడిని ఆశ్రయించానంటూ చెప్పుకొచ్చింది. మాంత్రికుడు బాలుడి ఆరోగ్యం కోసం పలురకాల పూజలు చేసి వెళ్లిపోయాడు. కోలుకున్నాడని భావిస్తున్నంతలోనే బాలుడు చనిపోయాడు. దీంతో బాధితురాలు కుంగిపోయింది. ఇదేమిటి.. ఇలా జరిగిందంటూ కాళీ బరి ఆలయానికి వెళ్లి అక్కడ ఉంటున్న మాంత్రికుడు ప్రశాంత్ ను కలిసింది. తన కుమారుడు ఎందుకు చనిపోయాడు.. ఎలా చనిపోయాడో చెప్పాలని నిలదీసింది. ఈ క్రమంలో అతడు ఆమెపై అత్యాచారం చేయబోగా.. చనిపోయిన ఆమె కుమారుడొచ్చి అడ్డుకున్నాడట.
ఇక అప్పటి నుంచి ప్రతిరోజు మాంత్రికుడు ప్రశాంత్ ప్రతిరోజు తన కలలోకి రావడం అత్యాచారం చేస్తున్నాడని చెబుతోంది. ఎన్నిసార్లు.. ఎన్నివిధాలుగా ప్రశ్నించినా.. అదే సమాధానం. దీంతో పోలీసులు వెళ్లి మాంత్రికుడు ప్రశాంత్ వద్దకు వెళ్లి ప్రశ్నించగా... ఆమె తనను ఎప్పుడూ కలుసుకోలేదని.. అంతా అబద్దం చెబుతోందని కొట్టిపడేశాడు. అతను చెబుతున్నది వాస్తవమేనని అనిపించింది. ఆమె చెబుతున్న ఆరోపణలకు తగిన ఆధారాలేవీ లభించలేదు. అయినప్పటికీ ఆమెను బుజ్జగించేందుకు నిందితుడి వద్ద బాండ్ పై సంతకం చేయించుకుని వదిలేశారు. ఆమెకు అగ్రిమెంట్ చూపించి.. ఇక నుంచి అతను ఎప్పుడూ మీ జోలికి రాడని సర్దుబాటు చేశారు. చిత్రంగా ఆ రోజు నుంచి ఆమెకు కలలు రావడం లేదట. పోలీసులు కేసు కొలిక్కివచ్చినట్లేనని భావిస్తున్నారు.