తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం  వేళ రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

 తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆమె సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణలో కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఐటీ సేవల్లో రాష్ట్రం గుర్తింపు పొందిందని రాష్ట్రపతి తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు మరింతగా అభివృద్ధి చెందాలని ముర్ము ఆకాంక్షించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి తెలంగాణ అందించిన సహకారం ప్రతి భారతీయుడికి గర్వకారణమంటూ ఆయన ప్రశంసించారు. సోషల్ మీడియా వేదిక(ఎక్స్) గా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ ఆయన పేర్కొన్నారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మహోజ్వల చరిత, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. సంప్రదాయ విలువలు, ఆధునికత మేళవించిన రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. సుసంపన్నమైన సహజ వనరులు, అద్భుతమైన మానవ వనరులతో విభిన్న రంగాల్లో సుస్థిర అభివృద్ధికి చిరునామా తెలంగాణ అని కీర్తించారు.

భిన్న సంస్కృతులు, భిన్న ప్రాంతాల ప్రజలను అక్కున చేర్చుకుంటూ మినీ భారత్​లాగా విలసిల్లే హైదరాబాద్ భిన్నత్వంలో ఏకత్వానికి, సౌబ్రాతృత్వానికి గొప్ప ప్రతీకని అన్నారు. భారత అభివృద్ధి పయనంలో తెలంగాణ మరింత కీలక భూమిక పోషించాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా బీజేపీ నాయకులు జేపీ నడ్డా, అమిత్​ షా, ​ తమ ఎక్స్​ ఖాతాలో తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ చరిత్రను ప్రశంసించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల క్రితం డాక్టర్ మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ హయాంలో లక్షలాది మంది ఆకాంక్షలను నెరవేర్చేలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం. తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి నా నివాళులు.అందరికీ న్యాయం, సమానత్వం, సాధికారత, ప్రజా తెలంగాణ దార్శనికతకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.