
- దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి
దుబ్బాక, వెలుగు: తెలంగాణ ప్రజల కరువును పారదోలిన కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజా కోర్టులోనే తేల్చుకుంటామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా బుధవారం తొగుట మండలం మల్లన్నసాగర్‌లో కేసీఆర్ ఫొటోకు జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ సర్కార్ తెలంగాణ ఆత్మబంధువు కేసీఆర్‌పై కుట్రలు చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని, ఎన్నో ప్రాజెక్టులు, బ్యారేజీలు, పంపు హౌజ్‌లు, కాల్వలు, సబ్ స్టేషన్, ఆర్అండ్ఆర్ లాంటి ప్రాజెక్టులు ఉంటాయని వివరించారు.
నాలుగైదేళ్లుగా మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు నల్లగొండ, సిరిసిల్ల జిల్లాలకు పోతుంటే ఒక్క ఎకరానికి నీళ్లు రావడంలేదని నిండు సభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సింగూరు, కడెం, పులిచింతల, ఎల్లంపల్లి, దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో కట్టలు, గేట్లు కొట్టుకపోవడం, పైపులు పేలిపోవడం జరగలేదా, వాటిపై ఎందుకు కమిషన్లు వేయలేదని ప్రశ్నించారు. 2028 ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ సీఎం ఖాయమని ప్రభాకర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.