హౌసింగ్ ఏఈ శ్రీకాంత్ డిస్మిస్

హౌసింగ్ ఏఈ శ్రీకాంత్ డిస్మిస్
  • అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
  • హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్

హైదరాబాద్, వెలుగు: విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడి, లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల అవుట్ సోర్సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ దుర్గం శ్రీకాంత్‌‌ను​ ఉద్యోగం నుంచి తొలగించినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం తెలిపారు. ఏఈపై  క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు భవిష్యత్తులో ఎక్కడా ఉద్యోగం రాకుండా వివరాలను బ్లాక్ లిస్టులో పెడుతున్నట్లు బుధవారం పత్రిక ప్రకటన రిలీజ్​చేశారు. శ్రీకాంత్ గతేడాది మే నెల నుంచి విధులను నిర్వహిస్తూ మంగళవారం నార్నూర్​లో ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి లంచం డిమాండ్ చేసి, రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. బిల్లులు రిలీజ్ చేసేందుకు ఇండ్ల ఫొటోలు అప్ లోడ్ చేయడానికి అధికారులెవరైనా నిరాకరిస్తే, ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా లబ్ధిదారులే స్వయంగా ఫొటోలను అప్ లోడ్ చేసుకోవచ్చని ఎండీ సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో అవినీతికి పాల్పడుతూ, లంచాలను డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ స్పష్టం చేశారు. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వారు జైలుకు వెళ్లడమే కాకుండా, తదుపరి వారికి ఎక్కడా ఉద్యోగాలు లభించవని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో వివిధ రకాల విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు, అధికారులైనా, డిప్యూటేషన్ పై వచ్చిన వారైనా, అవుట్ సోర్సింగ్ సిబ్బంది అయినా, అవినీతికి పాల్పడితే కేసులు ఎదుర్కోవాల్సిందే అని హెచ్చరించారు. ఈ అంశంలో ప్రజలకు ఏమైనా ఫిర్యాదులుంటే 1800 599 5991 కాల్ సెంటర్ కు ఫోన్ చేయాలని కోరారు. లబ్ధిదారులు తమ మొబైల్ ఫోన్ లో ఇందిరమ్మ ఇండ్ల యాప్​ను డౌన్​లోడ్ చేసుకొని, అందులో తమ ఫోన్ నంబరుతో (ఓటీపీ) లబ్ధిదారుగా లాగిన్ అవ్వాలన్నారు. తర్వాత డ్యాష్ బోర్డులోని వివరాల ప్రకారం ఇంటి ఫోటోలను తీసి లబ్ధిదారులే అప్ లోడ్ చేయవచ్చని ఎండీ లబ్ధిదారులకు సూచించారు.