ఈ‌‌–లైబ్రరీలు, ఇంటర్నెట్​ హామీలను  అమలు చేస్తలే

ఈ‌‌–లైబ్రరీలు, ఇంటర్నెట్​ హామీలను  అమలు చేస్తలే
  • సిటీ  సెంట్రల్ లైబ్రరీకే  ఇంటర్నెట్ ఫెసిలిటీ
  • నిరుద్యోగులు, స్టూడెంట్లు, సీనియర్ సిటిజన్లకు ​ఇబ్బందులు​ 
  • లైబ్రరీలకు బల్దియా  బకాయిలు  రూ. 749 కోట్లు

“ స్టూడెంట్లు, నిరుద్యోగుల కోసం సిటీలో ఈ – లైబ్రరీలు ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తాం.. సీనియర్ ​సిటిజన్ల కోసం ప్రతి డివిజన్​లో లైబ్రరీ, సీనియర్ ​సిటిజన్స్ ​క్లబ్, యోగా సెంటర్​, జిమ్​ ఏర్పాటు, ఫ్రీ గా బస్​పాసులు ఇస్తాం.’’ ఇది 2020, డిసెంబర్​లో  గ్రేటర్​ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్​ మేనిఫెస్టోలో  ఇచ్చిన హామీ.
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​ఎన్నికల్లో టీఆర్ఎస్​ ఇచ్చిన హామీలను మర్చిపోయింది. సిటీ డెవలప్ మెంట్ తన బాధ్యతని, మేనిఫెస్టోలోని హామీలను దగ్గరుండి అమలు చేయిస్తానని గతేడాది బల్దియా ఎన్నికల టైమ్​లో మంత్రి కేటీఆర్ చెప్పారు. పది నెలలు దాటినా పట్టించుకోవడంలేదు. స్టూడెంట్లు, నిరుద్యోగులకు ఈ–లైబ్రరీలు, ఇంటర్నెట్ ​ఫెసిలిటీ, సీనియర్ సిటిజన్స్​కు ప్రతి డివిజన్​లో లైబ్రరీ, జిమ్, యోగా సెంటర్లు పెట్టిస్తానని మేనిఫెస్టోలోనూ పెట్టారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. స్టూడెంట్లు , నిరుద్యోగులు కాంపిటీటివ్​ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం ప్రైవేట్ ​రీడింగ్ ​సెంటర్లకు వెళ్తుండగా, స్తోమత లేని వారు చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్​ లైబ్రరీ సమీపంలో అద్దెకు ఉంటూ ప్రిపేర్ అవుతున్నారు. ఈ–లైబ్రరీలను  అందుబాటులోకి తీసుకొస్తే వివిధ ప్రాంతాల వారు అక్కడే ఉండి చదువుకునేందుకు వీలుంటుంది.   
కొత్తవి లేవు.. ఉన్నవే తగ్గుతున్నయ్​ 
సిటీలో మరిన్ని లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ హామీ ఇచ్చింది. మరోవైపు ఉన్న లైబ్రరీలు తగ్గిపోతున్నాయి. పదేళ్ల క్రితం 89  లైబ్రరీలుండగా, ప్రస్తుతం 82 మాత్రమే ఉన్నాయి. కొన్నింటి భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం, మరికొన్నింటికి సొంత భవనాలు లేకపోవడంతో 7 లైబ్రరీలు ఖాళీ అయ్యాయి. వాటిస్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం కొన్ని భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నా  ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి.  మంత్రి కేటీఆర్​హామీ ప్రకారం చూస్తే 150 డివిజన్లలో 150 ఈ–లైబ్రరీలు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది.
బల్దియా రూ.749 కోట్లు బకాయి  
బల్దియాకు చెల్లించే పన్నులోంచి అందాల్సిన లైబ్రరీ సెస్​10 ఏళ్లుగా నిలిచిపోయింది. 8 శాతం గ్రంథాలయ సెస్ ను పన్నుల రూపంలో వసూలు చేస్తుండగా, లైబ్రరీలకు మాత్రం బల్దియా ఇవ్వడం లేదు.  ప్రతి నెలా మెయింటెనెన్స్​ కోసం రూ.15 లక్షలు మాత్రమే చెల్లిస్తుంది. తెలంగాణ ఏర్పడిన మొదటి ఏడాది కరెంట్​బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్​ సరఫరా నిలిపివేశారు. అప్పటి నుంచి ప్రతి నెలా మెయింటెనెన్స్​నిధులను బల్దియా రిలీజ్ చేస్తుంది. గత పదేండ్లుగా రూ.749 కోట్లు గ్రేటర్​లోని లైబ్రరీలకు బల్దియా బకాయి పడింది. ఫండ్స్​ ఇవ్వక పోవడంతో ఆ ప్రభావం రీడర్స్​ పైన పడుతోంది. ఫండ్స్​ అందుబాటులో లేక రీడర్స్​కు కావాల్సిన మెటీరియల్​ టైమ్​కు అందడం లేదు. జనం నుంచి వసూలు చేస్తున్న డబ్బులను ఖర్చు పెట్టడానికి బల్దియా ముందుకు రాకపోవడంపై సిటిజన్లు​ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిటీలోని ప్రతి లైబ్రరీ నిర్వహ‌ణ‌కు క‌నీసం రూ.1 కోటి వ‌ర‌కు నిధులు కావాలి. సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఇంతకు ఎక్కువే ఖర్చవుతుంది.


నెట్​ సౌకర్యం కల్పించాలె 
టెక్నాలజీ పెరుగుతున్నా లైబ్రరీల్లో పెద్దగా మార్పులు రావడంలేదు. జిల్లాల్లోని లైబ్రరీల్లో అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే ఎగ్జామ్స్​ప్రిపరేషన్​ కోసం సిటీకి రావాల్సిన అవసరం ఉండదు. ఇంటి అద్దె చెల్లిస్తూ చిక్కడపల్లిలోని సిటీ లైబ్రరీలో కాంపిటేటివ్​కు ప్రిపేర్​అవుతున్నా.
                                                                                                                                          - వినోద్ కుమార్, టేకులపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

లైబ్రరీ లేక.. ఇంట్లోనే..
కాంపిటేటివ్​ఎగ్జామ్స్​కు బుక్స్​కొని చదువుతున్నా.  దగ్గరలో లైబ్రరీ  లేదు. ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నా. ఇంటర్ నెట్​ఫెసిలిటీతో ఈ–లైబ్రరీలు ఏర్పాటు చేస్తే ఎంతో యూజ్​ఫుల్​గా ఉంటుంది.  ప్రభుత్వం వెంటనే పట్టించుకోవాలె.                                                    - జలజ, ఎంఏ, బీఈడీ, అత్తాపూర్